Share News

చేతులెలా వచ్చాయ్‌..!

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:04 AM

తప్పు చేసిందెవరు? తల్లా.. తండ్రా? వీరిద్దరి కుటుంబ సభ్యులా? తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసిన ఆమె.. బాధితురాలా, నిందితురాలా? నేరం చేసిందెవరోగానీ.. శిక్ష మాత్రం పసికందుకు వేశారు. ఏం జరిగిందో.. ఏమోగానీ బొడ్డూడని బిడ్డను ఆస్పత్రి ఆవరణలో ఉంచేసి వెళ్లారు. అమ్మఒడి నుంచి కటిక నేలపైకి చేరిన ఆ బిడ్డ బాధాకర ఘటన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసింది.

చేతులెలా వచ్చాయ్‌..!
చికిత్స పొందుతున్న శిశువు

  • ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మగశిశువును వదిలేసింది ఎవరు?

  • టీనేజ్‌ ప్రెగ్నెన్సీపై వైద్యుల అనుమానం

తప్పు చేసిందెవరు? తల్లా.. తండ్రా? వీరిద్దరి కుటుంబ సభ్యులా? తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసిన ఆమె.. బాధితురాలా, నిందితురాలా? నేరం చేసిందెవరోగానీ.. శిక్ష మాత్రం పసికందుకు వేశారు. ఏం జరిగిందో.. ఏమోగానీ బొడ్డూడని బిడ్డను ఆస్పత్రి ఆవరణలో ఉంచేసి వెళ్లారు. అమ్మఒడి నుంచి కటిక నేలపైకి చేరిన ఆ బిడ్డ బాధాకర ఘటన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసింది.

- చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి

ప్రతి రోజులాగే బుధవారం తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులు చిత్తూ ప్రభుత్వాస్పత్రిలోని మెటర్నటి వార్డు వెనుక శుభ్రం చేయడానికి వెళ్లారు. పార్కు ముందు గుడ్డలు కప్పి ఉండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి.. ఆ దుస్తులు తీసి చూస్తే మగ శిశువు ఉంది. చుట్టూ చూశారు. ఎవరూ కనిపించలేదు. ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు. సకాలంలో వైద్యం అందించారు. చిన్నారి కోలుకుంటోంది. ఈ సంఘటన కలకలం రేపింది. ప్రస్తుతం శిశువు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న మగబిడ్డను వదిలేసే పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక టీనేజ్‌ ప్రెగ్నెన్సీ కోణం ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. సామాజిక పరిస్థితులు, కుటుంబ సభ్యులకు తెలియకుండా గర్భం దాల్చడం తదితర కారణాలతో శిశువును వదిలేసి ఉండొచ్చా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదు. ఇక, శిశువును వదిలేసిన ప్రాంతం.. ఆస్పత్రికి ప్రవేశించే ప్రధాన మార్గంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిందితులను గుర్తించడం ఇబ్బందికరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని ఇతర కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే ఏదైనా ఆధారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా.. సీసీ కెమెరాల విషయంలో అధికారులు అజాగ్రత్తగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. వేలాది మంది వచ్చే ప్రభుత్వాస్పత్రిలో ఇకనైనా భద్రతా వ్యవస్థలోని లోపాలను గుర్తించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Sep 10 , 2026 | 02:04 AM