ఎలా తప్పించుకున్నాడు?
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:39 AM
ఎవరైనా దగ్గరుండి తీసుకెళ్లారా? లేదా అతడే ప్లాన్ ప్రకారం తప్పించుకుని వెళ్లాడా? పలమనేరు పట్టణం నుంచి ఎలా బయటపడ్డాడు? ఎక్కడకు చేరుకున్నాడు? వీరిపై జైలు వార్డర్ల నిఘా ఏమైంది? జైలులో అధికారుల వద్ద సత్ప్రవర్తనతో ఉన్నట్లు నటించాడా? జైళ్లశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తూ తప్పించుకున్న జీవిత ఖైదీ సూర్య అలియాస్ సూరి విషయంలో ఇవి సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిలాయి.
పలమనేరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా దగ్గరుండి తీసుకెళ్లారా? లేదా అతడే ప్లాన్ ప్రకారం తప్పించుకుని వెళ్లాడా? పలమనేరు పట్టణం నుంచి ఎలా బయటపడ్డాడు? ఎక్కడకు చేరుకున్నాడు? వీరిపై జైలు వార్డర్ల నిఘా ఏమైంది? జైలులో అధికారుల వద్ద సత్ప్రవర్తనతో ఉన్నట్లు నటించాడా? జైళ్లశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తూ తప్పించుకున్న జీవిత ఖైదీ సూర్య అలియాస్ సూరి విషయంలో ఇవి సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిలాయి. నాలుగు రోజులు దాటినా అతడి ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాగలాపురం పోలీసు స్టేషన్ పరిధిలో 2017 మే ఒకటో తేది రాత్రి పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు ఆదిఆంధ్రవాడకు చెందిన గజేంద్రను హత్య చేసిన సూరికి.. 2023లో శ్రీకాళహస్తి సెషన్స్ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఇతడిని జైళ్లశాఖ ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న పెట్రోలు బంకులో పనిచేసేందుకు పంపు ఆపరేటర్‌గా శిక్షణ ఇచ్చి నియమించారు. ఈనెల 9వతేది విధులు నిర్వహిస్తూ సాయంత్రం పరారయ్యాడు. దీనిపై జైలు సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు పరారై నాలుగు రోజులు దాటిపోతున్నా ఆచూకీ లభ్యం కాలేదు. ఎలా తప్పించుకొని వెళ్లాడు? ఎవరైనా ఇక్కడ్నుంచి తీసుకెళ్లారా? ఎవరితో కలిసి తప్పించుకోగలిగాడు అన్న విషయాలను సైతం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇక, ఐవోసీ పెట్రోలు బంకులో పనిచేసే సిబ్బందికి యూనిఫారం ఉంటుంది. వీరు బంకు నుంచి బయటకు వెళ్లినా ఎవరైనా సులభంగా గుర్తుపడతారు. ఈ యూనిఫారంతోనే పెట్రోలు బంకు నుంచి సూరి పరారైనా పలమనేరులోని ఒక సీసీ కెమెరాలోనూ అతడి కదలికలను పోలీసులు గుర్తించలేక పోయారు.
పనిచేయని సీసీ కెమెరాలు
పలమనేరు పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలావరకు పనిచేయడం లేదు. వీటి పర్యవేక్షణకు ఎనిమిది నెలల కిందటి వరకు పనిచేస్తున్న కానిస్టేబుల్.. ఇటీవల బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఈ సీసీ కెమెరాలను చూసేవారే లేరు. ఒకట్రెండు సీసీ కెమెరాలు పనిచేసినా, సూరి కదలికలు వాటిలో రికార్డు కాలేదని తెలిసింది. ఇక, ప్రైవేటు వ్యక్తుల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాల్సిన అవసరం ఉంది.