Share News

గృహ, జన గణన లెక్క తేలింది

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:47 AM

తిరుపతి జిల్లాలో తొలి విడత గృహ, జన గణన లెక్క తేలింది. మే ఒకటో తేదీనుంచి ప్రారంభమైన గణన ముగిసింది. 2011 లెక్కల ప్రకారం 7,06,055 గృహాలు ఉంటాయని అంచనా వేయగా.. 7,62,767గా లెక్క తేలింది. జనాభా అంచనా 22,17,515మంది కాగా 20,63,043మందిగా గుర్తించారు.

గృహ, జన గణన లెక్క తేలింది

అంచనాకంటే తగ్గిన జనాభా

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత గృహ, జన గణన లెక్క తేలింది. మే ఒకటో తేదీనుంచి ప్రారంభమైన గణన ముగిసింది. వాస్తవానికి గత నెలలో ముగియాల్సి ఉండగా.. ఈనెల మొదటి వారం వరకు గడువు పొడిగించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను నమోదు చేశారు. జిల్లాలోని 36 మండలాలతోపాటు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో గృహగణన చేపట్టారు. 2011 లెక్కల ప్రకారం 7,06,055 గృహాలు ఉంటాయని అంచనా వేయగా.. 7,62,767గా లెక్క తేలింది. జనాభా అంచనా 22,17,515మంది కాగా 20,63,043మందిగా గుర్తించారు.జనాభా విషయంలో అంచనాకంటే దాదాపు 1,54,472మంది తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో రెండో విడత జనగణనవచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. అప్పుడు మరింత స్పష్టత రానుంది. ఖాళీగా ఉన్న నివాసాలు 1,19,051, తాళం వేసినవి 2,577 ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తిరుపతి కార్పొరేషన్‌ జనాభా 4,50,971మంది

తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చేసరికి 1,08,016 గృహాలు ఉంటాయని అంచనా వేయగా.. 1,66,044గా తేలాయి. జనాభా విషయానికి వస్తే 5,71,055 మంది ఉంటారని అంచనా కాగా, 4,50,971మందిగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ 79శాతం మాత్రమే గృహ గణన జరిగింది. ఖాళీ నివాసాలు 20,674గుర్తించగా, తాళం వేసిన ఇళ్లు 193గా తేలాయి.

షార్‌కు మినహాయింపు

జనగణన ప్రక్రియలో మొదటి దశ గృహ గణనకు సూళ్లూరుపేటలోని షార్‌కు భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇచ్చారు. షార్‌ డైరెక్టర్‌తో పాటు సీనియర్‌ శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది 3వేలమంది దాకా ఉన్నట్లు అంచనా వేసినట్లు ఆర్డీవో దేవేంద్రరెడ్డి తెలిపారు. రెండో విడత ఫిబ్రవరిలో ఇక్కడ గణన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా, సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని షార్‌కు చెందిన ఉద్యోగులు నివాసం ఉంటున్న డీఆర్‌డీఎల్‌, డీవోఎస్‌, కేఆర్‌పాలెం కాలనీల్లో సుమారు వెయ్యి ఇళ్ల గణన చేసినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ, జిల్లాలో జనగణన ప్రక్రియ మొదటి విడతను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 01:47 AM