Share News

ఉద్యాన పంటలే కరువులో రైతులకు ఆదరువు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:29 AM

వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు రైతులకు భరోసా కల్పిస్తాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉద్యాన పంటలే   కరువులో రైతులకు ఆదరువు
మామిడి తోటలో చెట్ల చుట్టూ వీడ్‌మ్యాట్‌ ఏర్పాటు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు రైతులకు భరోసా కల్పిస్తాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అధికారులు ఎల్‌నినో నేపథ్యంలో పంటలను కాపాడుకునేలా సూచనలు చేస్తున్నారు. ఐదు పద్ధతుల ద్వారా ఉద్యాన పంటలను సంరక్షించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ తేమతో మామిడి తోటలను కాపాడుకునే మెలకువలపై ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఈ క్రమంలో ప్రోత్సాహకాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలో 1.78 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 93,750 ఎకరాల్లో మామిడి, 60 వేల ఎకరాల్లో టమోటా, మిగిలిన 28 వేల ఎకరాల్లో ఇతర ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు.

నీటి నిల్వ కుంటలు

ఎల్‌నినో వల్ల చినుకే బంగారమైంది. అక్కడక్కడా చిన్నపాటి జల్లులు తప్ప వర్షం పడిన దాఖలా కనిపించడంలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యాన పంటల రక్షణకు అధికారులు ఐదు పద్ధతులను రైతులకు వివరిస్తున్నారు. అస్థిర వాతావరణం నుంచి పంటల రక్షణకు, పంట దిగుబడి, నాణ్యత పెంచేందుకు ఇవి దోహదపడతాయం టున్నారు. పొలాల్లో నీటిని సంరక్షించేందుకు వ్యక్తిగత ఫారంపాండ్స్‌(నీటి కుంటలు) 20 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు తవ్వడానికి ప్రభుత్వం రూ.90వేలు రాయితీగా ఇస్తోంది. సామూహిక ఫారంపాండ్‌ నిర్మాణం 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు ఫారంపాండ్‌ నిర్మాణానికి రూ.18 లక్షలు రాయితీ ఇస్తోంది.

వీడ్‌ మ్యాట్‌

వీడ్‌మ్యాట్‌తో మొక్కల చుట్టూ ప్రత్యేక కవర్‌ పరుస్తారు. తద్వారా కలుపు మొక్కలు పెరగకుండా నివారిస్తుంది. నేలలో తేమశాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నీటి వినియోగం 30-40శాతం తగ్గుతుంది. నేలలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటూ మొక్క వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. కలుపు ఖర్చులు తగ్గుతాయి. పండ్ల నాణ్యత పెరిగి, దిగుబడి రెట్టింపవుతుంది. 110 జీఎ్‌సఏ మందం కలిగిన వీడ్‌మ్యాట్‌పై చదరపు మీటర్‌కు గరిష్టంగా రూ.25 చొప్పున ఒక్కో రైతుకు రూ.లక్ష దాకా రాయితీ వస్తుంది.

డ్రిప్‌ ఇరిగేషన్‌

డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతి ద్వారా మొక్కలను నీటి వినియోగంలో గణనీయమైన పొదుపు ఉంటుంది. 40-60శాతం నీరు ఆదా అవుతుంది. డ్రిప్‌ పద్ధతి ద్వారా ఎరువులను నీటిలో కలిపి నేరుగా మొక్కలకు అందించవచ్చు. బోరు నిర్వహణలో విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న వారికి 100శాతం రాయితీ, 10 ఎకరాల లోపు ఉన్న వారికి 90శాతం రాయితీ, ఓసీ, బీసీ, మైనారిటీ రైతులకు 1 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికి 90 శాతం రాయితీ వర్తిస్తుంది.

టమోటా పంట బీమా

ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్ట పరిహారం కోసం టమోట పంటబీమా ఉపయోగపడుతుంది. రైతు పెట్టుబడికి భరోసా, పంట నష్టపరిహారం. ఎకరా టమోటా పంటకు బీమా ప్రీమియం రూ.1,600 చెల్లిస్తే రూ.32వేల వరకు నష్టపరిహారం పొందవచ్చు.

పీఎండీఎస్‌

ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ పద్ధతి ద్వారా చిరుధాన్యాల విత్తనాలు, మిశ్రమ విత్తనాలను భూమిపై వెదజల్లి తక్కువ తేమ శాతంతో పంటలు సాగు చేయడం. ఈ పద్ధతితో నేలలో తేమశాతం పెరగడం, నేల బట్టబారడం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం.

Updated Date - Aug 03 , 2026 | 12:29 AM