Share News

భూముల విముక్తిపై చిగురించిన ఆశలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:42 AM

మాజీ మంత్రి పెద్దిరెడ్డి కక్ష సాధింపు ఫలితంగా నిషేధిత జాబితాలో చేరిన భూములకు ఇకనైనా విముక్తి లభిస్తుందని పలువురు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తాజాగా 22ఏ జాబితా నుంచి కొన్ని వేల ఎకరాలకు విముక్తి కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో బాధితుల్లో ఆశలు చిగురించాయి.

భూముల విముక్తిపై చిగురించిన ఆశలు
సీఎం చంద్రబాబును కలిసిన రైతు లక్ష్మీపతి నాయుడు

అడ్డగోలుగా 22ఏ జాబితాలోకి 911 ఎకరాలు

తాజాగా సీఎం చంద్రబాబును కలిసిన బాధితులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి కక్ష సాధింపు ఫలితంగా నిషేధిత జాబితాలో చేరిన భూములకు ఇకనైనా విముక్తి లభిస్తుందని పలువురు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తాజాగా 22ఏ జాబితా నుంచి కొన్ని వేల ఎకరాలకు విముక్తి కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో బాధితుల్లో ఆశలు చిగురించాయి.

పుంగనూరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఆవులపల్లె సీతమ్మ చెరువు కట్ట స్థానంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మూడు పంటలు పండే వ్యవసాయ భూములు, ఫలసాయంతోపాటు అనేక గ్రామాలు నీట మునుగుతాయని పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీతమ్మ చెరువు వెనుక భాగంలో ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వ భూమిలో రిజర్వాయర్‌ నిర్మించాలని వీరు సూచించారు. అయితే పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ మాత్రం ఇందుకు ససేమిరా అన్నారు. అదేస్థలంలో నిర్మిస్తామని పట్టుపట్టారు.

రిజర్వాయర్‌ వ్యతిరేకించారనే కక్షతో..

2021లో బాధిత రైతులు రిజర్వాయర్‌ నిర్మాణంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ )కి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచీ ఆవులపల్లె, బయ్యారెడ్డిపల్లె, చిన్నదేవళకుప్పం, పెద్దదేవళకుప్పం, మల్లేశ్వరం, రామకృష్ణాపురాలకు చెందిన రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వివిధ శాఖల అధికారుల నుంచి రైతులపై కేసులు, దాడులతో పాటు రెవెన్యూ రికార్డుల మార్పులు లాంటి వేధింపులకు దిగారు. ఈ నేపథ్యంలో 2023 మేలో పర్యావరణ అనుమతులు లేకుండా రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారని ఎన్జీటీ నాటి జగన్‌ ప్రభుత్వానికి రూ.100 కోట్లు భారీ జరిమానా విధించింది. రిజర్వాయర్‌ పనులు నిలిపివేయాలని తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఫలితంగా పెద్దిరెడ్డికి చెందిన మూడు కాంట్రాక్ట్‌ పనులు ఆగిపోయాయి.

22ఏ (1)(బీ)లోకి భూములు

పనుల నిలిపివేతకు కారణమయ్యారంటూ రైతులపై వైసీపీ నేతలు కక్ష సాధింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే 2023లో సదుం మండలం పచ్చార్లమాకులపల్లెకు చెందిన అప్పిరెడ్డి శ్రీహరి అనే వ్యక్తి ఆవులపల్లె పంచాయతీలోని సర్వే నెంబరు 37 తదితర నెంబర్లులోని 911.34 ఎకరాల భూములు ప్రభుత్వ భూములని, వెంటనే వాటిని నిషేధిత జాబితా 22ఏ (1)(బీ)లో చేర్చాలని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాలతో 55 మంది రైతులకు చెందిన 911 ఎకరాలు 22ఏ జాబితాలో చేర్చాలని ఉత్తర్వులిచ్చారు. 60 ఏళ్లుగా సాగులోని తమ భూములను ఈ జాబితాలోకి చేర్చడంతో రైతులు అవాక్కయ్యారు. ఈ విషయమై పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ద్వారా బాధితులు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సీసీఎల్‌ఏ, కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌లను పలుమార్లు కలిశారు. గత ఏడాది మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆవులపల్లె సందర్శించి రైతులకు న్యాయం చేస్తానని, సీతమ్మ చెరువు గతంలో వలే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇంతవరకూ న్యాయం జరగలేదు.

సీఎంను కలిసిన బాధిత రైతులు

22ఏ నుంచి వేలాది ఎకరాలకు విముక్తి కల్పించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బాధిత రైతులు తాజాగా సీఎం చంద్రబాబును బుధవారం కలిశారు. పెద్దిరెడ్డి బాధితులమైన తమకు ఇప్పుడైనా న్యాయం చేయాలని ఆవులపల్లె రైతు నాయకుడు లక్ష్మీపతి నాయుడు తదితరులు విన్నవించారు. దీనిపై సీఎంవో ఓఎస్‌డీ విజయానంద్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు ఫోన్‌ చేశారు. రైతుల సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈసారైనా తమ భూములకు విముక్తి కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. తమ అభ్యర్థన మేరకు సీతమ్మ చెరువు కట్ట కట్టడానికి చర్యలు తీసుకోవాలని ఫైనాన్స్‌ విభాగానికి ఆదేశాలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 01:43 AM