Share News

ఎర్ర స్మగ్లింగ్‌కు హాలిడే

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:02 AM

శేషాచల అడవుల్లో కనిపించని తమిళ కూలీలు ఎన్నికల వాతావరణమే కారణమంటున్న అధికారులు

 ఎర్ర స్మగ్లింగ్‌కు హాలిడే

తిరుపతి(కపిలతీర్థం)/అన్నమయ్య, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కొన్నాళ్లుగా శేషాచల కొండల్లో ఎర్రచందనం కూలీలు కనిపించడంలేదు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గింది. ముఖ్యంగా ఎర్రచందనం వృక్షాలను నరకడానికి తమిళనాడు నుంచి కూలీల రాక తగ్గిపోవడానికి అక్కడ జరిగిన ఎన్నికల సందడే కారణంగా అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వీరి సేవలను పార్టీలు వినియోగించుకోవడం ఒక కారణమైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ ఆపి పోలీసులు తనిఖీ చేస్తుండడం మరో కారణమంటున్నారు. ఎర్రచందనం వృక్షాలను నరికే సాహసం లోకల్‌గా ఉన్న వ్యక్తులు చేయలేరు. దాదాపు 30 కిలోమీటర్ల దాకా అడవుల్లో నడిచి చెట్లను నరికి లోడింగ్‌ పాయింట్‌కు చేర్చాలి. జావాది హిల్స్‌లోని తమిళనాడు కూలీలు వీరప్పన్‌ హయాంలోనే శ్రీగఽంధం చెట్లను నరికేవారు. ఇదే వృత్తికి అలవాటు పడడంతో వారికి మాత్రమే ఎర్రచందనం వృక్షాలను నరికి లోడింగ్‌ పాయింట్‌కు చేర్చడం సాధ్యమవుతుంది.వారు శేషాచల కొండల్లోకి రాకపోవడంతో స్మగ్లింగ్‌ కార్యకలాపాలు తగ్గాయి.

పెరిగిన ఉష్ణోగ్రతలు కూడా సమస్యే

శేషాచల కొండల్లో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా సాయంత్రం అయ్యే సరికి వాతావరణం చల్లగా మారుతుంది. అయితే అడవుల్లో ఈ పరిస్థితి ఉండదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలతో కొండలు విపరీతంగా వేడెక్కుతాయి. ఈ కారణంగానే ఇక్కడ నీటి లభ్యత ఉండదు. వన్యప్రాణులు సైతం నీటికోసం సమీప గ్రామాల్లోకి పరుగులు పెడుతుంటాయి. తాగునీరు లేక తీవ్ర వడదెబ్బకు గురై ప్రాణల మీదకు తెచ్చుకోవడం ఇష్టంలేక వచ్చే కూలీల సంఖ్య తగ్గిందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు కొత్తగా ఏర్పాటుచేసిన ఎర్రచందనం ప్రొటెక్షన్‌ సెల్‌, టాస్క్‌ఫోర్సు బృందాలు నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్‌లు నిర్వహిస్తుండడం కూడా స్మగ్లర్లకు ఇబ్బందికరంగా మారింది.

మళ్లీ కొండెక్కుతారా?

ఎన్నికల సమయంలో పార్టీలు అందించే తాయిలాలు అందుకోవడం, ఓట్లు వేశాక తాము మద్దతిచ్చిన అభ్యర్థి విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని... ఆ తరువాత శేషాచల కొండల్లోకి తమిళనాడు కూలీలు వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వారంలో తమిళనాట ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఆ తరువాత బృందాలుగా కూలీలు అడవి బాట పడతారని భావిస్తున్నారు.దాదాపు నెల రోజుల పాటు స్మగ్లర్లు ఇటువైపు రాకపోతే నెలకొన్న ఈ ప్రశాంతత కొనసాగాలంటే అటవీశాఖ, టాస్క్‌ఫోర్సు అందుకు తగ్గట్టుగా ఆలోచించడం ఎంతైనా అవసరం.వందలమంది సిబ్బంది, ఆఽధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇన్నాళ్లూ స్మగ్లర్లను ఆపలేకపోయిందన్న విషయం గుర్తించాల్సి ఉంది.

నెలరోజులుగా స్మగ్లర్ల కదలికలు లేవు

నెలరోజులుగా స్మగ్లర్ల కదలికలు కనిపించడంలేదు.ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో నీరు దొరికే అవకాశం తగ్గిపోయింది. నీరు దొరికే ప్రాంతాల్లో మా బృందాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. స్మగ్లర్ల కదలికలు తగ్గినప్పటికీ మా పని కొనసాగిస్తున్నాం. తిరిగి స్మగ్లర్లు అటవీప్రాంతంలోకి ప్రవేశిస్తే వారిని ఎలా అడ్డుకోవాలో అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నాం.

రామకొండారెడ్డి,

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో,

రెడ్‌ శాండిల్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ నోడల్‌ ఆఫీసర్‌

Updated Date - Apr 28 , 2026 | 01:02 AM