క్రేన్ ప్రమాదంపై ఉన్నతాధికారుల విచారణ
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:59 AM
తిరుపతి డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో మంగళవారం భారీ క్రేన్ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బుధవారం ఉన్నతాధికారుల విచారణ జరిగింది.
తిరుపతి సెంట్రల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తిరుపతి డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో మంగళవారం భారీ క్రేన్ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బుధవారం ఉన్నతాధికారుల విచారణ జరిగింది.ఘటన జరిగిన తీరుపై మంగళవారం రాత్రి అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో బాఽధ్యులైన టౌన్‌ప్లానింగ్ కార్యదర్శి పూర్ణచంద్ర సాయిని, ఇన్‌చార్జి టీపీబీవో భానుప్రకాష్ రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం తుడా సీపీవో దేవికుమారి, నగర పాలక సంస్థ ఎస్‌ఈ శ్యాంసుందర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజానాయక్ ఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించారు. భవన నిర్మాణానికి అనుమతించిన స్థలంలో చుట్టూ నిబంధనల మేరకు ఖాళీ స్థలం వదలలేదని గుర్తించారు.ఆ ప్రాంతాన్ని నిర్మాణ అవసరాలకు వినియోగించడమే కాకుండా భారీ యంత్రాలతో లోతైన తవ్వకాలు చేపట్టారు. పక్కనున్న భూమి, ప్రహరీ, రహదారి, సమీప భవనాలపై ప్రభావం వుంటుందనే ఆలోచన లేకుండా బిల్డర్ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఘటన జరిగిందని అంచనాకు వచ్చారు.ప్రమాద స్థలానికి పక్కనే వున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ పాఠశాలను కూడా విచారణ అధికారులు పరిశీలించారు. ప్రమాదం నేపధ్యంలో పాఠశాల భవనం ఎలావుందనే అంశాన్ని కూడా పరిశీలించారు. భవనానికి అక్కడక్కడ నెర్రెలు కన్పించడంతో వీలైనంత వరకు తరగతి గదులు పక్కకు మార్చుకుంటే మంచిదనే అభిప్రాయం నివేదికలో పొందుపరచనున్నారు.