గుప్త నిధుల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:03 AM
గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన తొమ్మిది మందిని శుక్రవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.
ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్, ఆటో, బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం
గుర్రంకొండ, జూలై 3(ఆంధ్రజ్యోతి): గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన తొమ్మిది మందిని శుక్రవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. అమిలేపల్లె పంచాయతీ శ్రీనివాసపురం పరిధి సర్వే నంబరు 45/1లో ఎస్.గోవిందుకు చెందిన వ్యవసాయ పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డికి సమాచారం వచ్చింది. వేకువజామున దాడులు నిర్వహించి గుర్రంకొండ మండలం అమిలేపల్లె వాసి ఎస్.గోవిందు, ఖండ్రిగకు చెందిన ఎస్.ముస్తాక్, గుర్రంకొండ బలిజగడ్డకు చెందిన మురాద్ షావలి, సత్యసాయి జిల్లా తనకల్లు వాసులు మహమ్మద్ అఫ్సర్, సురేంద్ర, మహేశ్, వెంకటేశ్, నంబులపూలకుంట మండల వాసులు రాము, దేవేంద్రను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గుప్తనిధుల తవ్వకాలకు వినియోగించిన పేలుడు పదార్థాలు, పూజా సామగ్రి సహా ఎక్స్‌కవేటర్, ఆటో, ట్రాక్టర్, నాలుగు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకున్న సీఐ రాఘవరెడ్డిని, సిబ్బందిని డీఎస్పీ ప్రశంసించారు.