Share News

హాయ్‌.. బ్రో! జెన్‌ జీ విఘ్నేష్‌ టాక్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:35 AM

హాయ్‌ బ్రో.. గుడ్‌ మాణింగ్‌. వచ్చే దారంతా చెరువులు ఎండి బావురుమంటున్నాయి. భూములు బీళ్లై నోళ్లు తెరిచాయి. పెట్టిన పంటలు నిలువునా ఎండి మోడులే మిగిలాయి. ఎటుచూసినా కరువు విలయతాండవం. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా డస్సిపోయిన జనం. దానికి మమ్మేం చేయమంటావు, విధి రాత, మా ఖర్మ అంటావా.

హాయ్‌.. బ్రో!  జెన్‌ జీ విఘ్నేష్‌ టాక్‌
జెన్‌ జీ వినాయకుడు

కుప్పం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హాయ్‌ బ్రో.. గుడ్‌ మాణింగ్‌. వచ్చే దారంతా చెరువులు ఎండి బావురుమంటున్నాయి. భూములు బీళ్లై నోళ్లు తెరిచాయి. పెట్టిన పంటలు నిలువునా ఎండి మోడులే మిగిలాయి. ఎటుచూసినా కరువు విలయతాండవం. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా డస్సిపోయిన జనం. దానికి మమ్మేం చేయమంటావు, విధి రాత, మా ఖర్మ అంటావా.

కరెక్ట్‌.. ఎల్‌నినో ఇలా కాలాన్ని ఎండబెట్టేసింది. కానీ బ్రో.. అలా డీలా పడిపోతే ఎలా? నేను ఉన్నా కదా.. చూసుకుందాం లే. అలాగని అంతా మార్చేస్తానని చెప్పడం లేదు బ్రో. ‘మానవ ప్రయత్నం లేనిదే దేవుడైనా ఏం చేయగలడు?’ అని మా అంకుల్‌ శ్రీకృష్ణ భగవద్గీతలో అన్నట్లున్నాడు. చెబుతున్నా కదా బ్రో.. ముందుగా మారాల్సింది మీరు.. మీ అలవాట్లే.

నన్ను చూశారా? జెన్‌ జీ విఘ్నే్‌షని. అయినా ఇప్పటికీ పత్రి పూజంటే నాకిష్టం. బియ్యప్పిండితో చేసిన ఉండ్రాళ్లంటే మహా ప్రీతి. డ్యామ్‌ లైకింగ్‌ అనుకో. నెయ్యితో కలిపిన బియ్యప్పిండి హబ్బా.. ఎంత టేస్టీనో. ఇదిగో.. మా ఎలుకపిల్ల స్టైల్‌ చూశారా? కళ్లకు గాగుల్స్‌, ల్యాప్‌టాప్‌ బ్యాక్‌ ప్యాక్‌. తింటున్నది మాత్రం ఒట్టి ఉండ్రాళ్లే. అది నా కళ్లుగప్పి పళ్లు పటపటలాడిస్తూ కొరుక్కు తినేది మా మా మామ్‌ పార్వతి దొంతుల్లో దాచిపెట్టిన వొడ్ల గింజలే.

బట్‌ బ్రో.. మీరేమో తినేది పిజ్జాలు, బర్గర్లు. తాగేది కూల్‌ అండ్‌ ఎనర్జీ డ్రింక్‌లు. ఉండేది సెంట్రలైజ్‌డ్‌ ఏసీ చాంబర్లు. అభివృద్ధి పేరుతో కూల్చేది పచ్చటి చెట్లు. తొలిచేది కొండలు, గుట్టలు. తోడేది చెరువుల్లో ఇసుక, మన్ను. ఇక ఎల్‌నినోను తిట్టుకుని ఏం లాభం బ్రో. అసలీ ఎల్‌నినో అంటే ఏంటో తెలుసా? పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కడం. ప్రతి రెండునుంచి ఏడేళ్లకు ఒకసారి సంభవించే ఈ ఎల్‌నినో ప్రభావం సుమారు 9-12 నెలలపాటు కొనసాగుతుందట. మా డాడ్‌ శివయ్య చెప్పారులే, ఈ సమాచారం. ఇంకా ఆయనేం అన్నారంటే.. ఎల్‌నినో వల్ల సహజంగా రావాల్సిన రుతుపవనాలు వీక్‌ అవుతాయట. తాగడానికి వాటర్‌ ఉండదు. తినడానికి తిండి దొరకదు. తీవ్రమైన కరువు పరిస్థితులు. ఇక పంటలు ఎక్కడ పండుతాయి? ఇది మన దేశంలో, మరికొన్ని దేశాల్లో అయితే వరదలు వచ్చి సమస్తం కొట్టుకు పోతుందట.

మరి కాజ్‌ మేమేనంటావేమిటి? అని మండిపడుతున్నావు కదా. బ్రో.. బ్రో.. ఆగాగు, అక్కడికే వస్తున్నా. చెట్లు కొట్టేసి, కొండలు, గుట్టలు కూల్చేసి, చెరువుల్లో ఇసుక, మన్ను లోడేసి ప్రకృతిని విధ్వంసం చేసింది ఎవరు? మీరే కదా. మరి సముద్ర జలాలు వేడెక్కకుండా కూల్‌గా ఉంటాయా? అవును బ్రో.. మీకో విషయం చెప్పడం మరిచాను. ఈమధ్య మా ఫ్యామిలీ రెసిడెన్స్‌ మంచు కొండ కూడా కరిగిపోతోంది నెమ్మదిగా. అర్లీ మాణింగ్‌ ఏం జరిగిందో తెలుసా? నేను గాఢ నిద్రలో ఉన్నా. ఉన్నట్టుండి కిందికి కుంగిపోతున్నట్టనిపించి బిగ్గరగా కేకలు పెట్టా. నేను పడుకున్నది మంచుకొండ వాలులో. మా బ్రదర్‌ సుబ్రమణ్యం ఉండాడు చూశారా. నా కేకలతో వచ్చి రెండు చేతులతో జవిరి ఇవతల పడేశాడు. గండం గడిచింది. లేకపోతే కరిగి నీళ్లైపోయిన ఆమంచుకొండ వాలు సహా లోయలోకి జారిపోయే వాడినే. అందుకే భయమేసి.. మీరు పిలవకున్నా, మా మామ్‌, డాడ్‌కు చెప్పకుండా ఎలుకపిల్లను వెంటేసుకుని పరుగులు పెడుతూ ఈ భూమ్మీద వాలిపోయా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే బ్రో.. ఆధునిక జీవన సౌకర్యాలకోసం ప్రకృతిని విధ్వంసం చేయడం మానండి. లేదంటే.. ఇటువంటి ఎల్‌నినోలు ఇంకెన్నో మీదపడి మొత్తం భూమిపైని జీవాన్నే తుడిచేస్తాయి. ఇలా మిమ్మల్ని అడుక్కోవడంలో సెల్ఫి్‌షనెస్‌ కూడా ఉంది బ్రో. మీరు లేకపోతే వినాయక చవితికి నేను ఎవరి ఇళ్లకు వెళ్లాలి? పుట్టినరోజులు ఎక్కడ జరుపుకోవాలి? అదీ నా మెయిన్‌ పాయింట్‌. అర్థమైంది కదా బ్రో..!

Updated Date - Sep 14 , 2026 | 01:35 AM