చిత్తూరు మేయర్ పీఠంపై మరోసారి హేమలత
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:44 AM
చిత్తూరు మేయర్ పీఠం మరోసారి కఠారి హేమలత దక్కింది. వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ మీద ఏకంగా 34116 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. ప్రతి రౌండులోనూ ఆమెకే ఆధిక్యత లభించింది. ఇంతటి ఘన విజయం ఇవ్వడం వెనుక.. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలన్నది ప్రజల ఆకాంక్షగా స్పష్టమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో ప్రత్యేక నిధులు కేటాయించి మరీ నగరంలోని అన్ని రహదారుల్ని విస్తరిస్తున్నారు. మరెన్నో పనులు జరుగుతున్నాయి. మరోవైపు హేమలతకు పార్టీలకతీతంగా మంచి పేరుంది.
34,116 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
చిత్తూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మేయర్ పీఠం మరోసారి కఠారి హేమలత దక్కింది. వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ మీద ఏకంగా 34116 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. ప్రతి రౌండులోనూ ఆమెకే ఆధిక్యత లభించింది. ఇంతటి ఘన విజయం ఇవ్వడం వెనుక.. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలన్నది ప్రజల ఆకాంక్షగా స్పష్టమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో ప్రత్యేక నిధులు కేటాయించి మరీ నగరంలోని అన్ని రహదారుల్ని విస్తరిస్తున్నారు. మరెన్నో పనులు జరుగుతున్నాయి. మరోవైపు హేమలతకు పార్టీలకతీతంగా మంచి పేరుంది. కుటుంబాన్ని కోల్పోయారనే సానుభూతి ప్రజల్లో ఉంది. అత్తామామలు చనిపోయాక మేయర్‌గా పనిచేసిన సమయంలో హేమలత పనితీరును స్థానికులు పరిశీలించారు. అప్పటి ఎమ్మెల్యే సత్యప్రభతో హేమలత సమన్వయం చేసుకుని నగర అభివృద్ధికి కారకురాలయ్యారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నాటి ప్రభుత్వం ఆమెపై అక్రమ కేసులూ పెట్టింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న టీడీపీ అధిష్ఠానం.. వివిధ కోణాల్లో నివేదికలు తెప్పించుకుని ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. హేమలత అభ్యర్థి కావడంతో టీడీపీలోని మిగిలిన నాయకులూ విజయానికి కృషి చేశారు. ప్రజల్లోనూ కఠారి కుటుంబంపై ఉన్న సానుకూలత వెరసి భారీ మెజారిటీ లభించిందని పరిశీలకులు అంటున్నారు.
చేతులెత్తేసిన వైసీపీ
అత్యధిక ఏకగ్రీవాల నేపథ్యంలో వైసీపీలో నైరాశ్యం నెలకొంది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో చేతులెత్తేసిందని తెలుస్తోంది. నగర ప్రజల్లో ఎక్కువ మందికి అభ్యర్థి చంద్రశేఖర్ తెలియకపోవడం, కీలక నాయకులు మనస్ఫూర్తిగా పనిచేయకపోవడం, అవసరమైన స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టకపోవడం కారణాలుగా తెలుస్తోంది.