గుండె ‘చెరువు’
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:51 AM
కుప్పం నియోజకవర్గంలోని కొన్ని చెరువులు ఇంకా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉపకాలువల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో ఇవి ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే సీఎం చంద్రబాబు చొరవతో హంద్రీ-నీవా కాలువ పనులను వడివడిగా పూర్తి చేయించారు.
ఉపకాలవలు లేక చేరని కృష్ణాజలాలు
2 మండలాల్లో ఎండుతున్న చెరువులు
వర్షాభావంతో మరింత గడ్డు పరిస్థ్టితులు
రామకుప్పం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలోని కొన్ని చెరువులు ఇంకా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉపకాలువల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో ఇవి ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే సీఎం చంద్రబాబు చొరవతో హంద్రీ-నీవా కాలువ పనులను వడివడిగా పూర్తి చేయించారు. అసంపూర్తి పనులతో పాటు, కాలువ పొడవునా కాంక్రీట్ లైనింగ్ నిర్మించారు. గతేడాది ఆగస్టులో కృష్ణాజలాలు కుప్పంకు చేరాయి. సెప్టెంబరులో సీఎం పరమచెరువు వద్ద జలహారతి కూడా ఇచ్చారు. అయితే 2016లో కాలువ తవ్వకాల పనులు చేపట్టినపుడ వి.కోట, రామకుప్పం మండలాల్లో సంబంధిత అధికార్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇక్కడి ప్రజాప్రతినిధులూ చొరవ తీసుకోలేదు. దీంతో ఈ రెండు మండలాల్లోని సుమారు 30చెరువులకు కృష్ణాజలాలు చేరలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ చెరువులు ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి.
ఇలా చేస్తే జలకళ
రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ-నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి మిట్టపల్లె పెద్దచెరువు వరకు ఉపకాలువ నిర్మిస్తే మండలంలోని సుమారు పదిచెరువులకు జలాలు చేరేవి. బైపరెడ్లపల్లె వద్ద బ్రాంచ్ కెనాల్ నుంచి రామకుప్పం మండలం గురవిరిరెడ్డికుంట వరకు ఉపకాలువ ఏర్పాటు చేస్తే గురివిరెడ్డి కుంటతో పాటు నాగులకుంట, నాయనచెరువు, బోన్‌చెరువు, బోయనపల్లెకుంట, సాకలకుప్పం చెరువులకు జలాలు వచ్చేవి. సాకలకుప్పం చెరువు మొరవ ప్రవహిస్తే గొలుసుకట్టు చెరువులైన దేశినాయనపల్లెచెరువు, మండోనికుంట, పంద్యాలమడుగు, పీఎంకేతండా, పీఎంతండా, చిన్నబల్దారు, పెద్దబల్దారు, కవ్వంపల్లె చెరువులు నిండుతాయి. అక్కడి నుంచి వి.కోట మండలం రాగిసముద్రంచెరువు, యనమలచెరువు, గంగేపల్లి, పెసలుదొడ్డి, ఎస్.బండపల్లె, కొత్తకోట, ఆకులదొడ్డి, చింతమాకులపల్లె, భీమునికుంట, నాయకనేరి తదితర చెరువులకు జలాలు చేరతాయి.
ఎత్తిపోతల చేపడితే నీళ్లు
బైపరెడ్లపల్లె నుంచి కెంపసముద్రం మీదుగా కనమనాయనపల్లె చెరువుకు ఉప కాలువ ఏర్పాటు చేయాలి. అక్కడి చెరువు నుంచి ఎత్తిపోతల ద్వారా బందార్లపల్లె కొత్తచెరువుకు, ఎత్తిపోతల ద్వారా సగినేకుప్పం చెరువుకు జలాలు తరలించేందుకు అవకాశమేర్పడుతుంది. సగినేకుప్పం చెరువు మొరవ ప్రవహిస్తే ముద్దనపల్లె, 89పెద్దూరు పంచాయతీలతో పాటూ అటవీ ప్రాంత చెరువులకూ జలాలు చేరతాయి. బైపరెడ్లపల్లె వద్ద కెనాల్ నుంచి గురవిరెడ్డి కుంట, కెంపసముద్రం మీదుగా కనమనాయనపల్లె చెరువులకు ఉపకాలువలు నిర్మించాలి. కనుమనాయనపలె ్లచెరువు నుంచి ఎత్తిపోతల ద్వారా బందార్లపల్లెకొత్తచెరువుకు, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా సగినేకుప్పంచెరువుకు జలాలు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని రామకుప్పం, వి.కోట మండలాల రైతులు కోరుతున్నారు.
రబీ నాటికైనా నీరు చేరేనా?
ఖరీఫ్ సీజన్ ప్రారంభయినా వానలు కురవడం లేదు. గతాడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో చెరువుల్లో జలాలు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి. అధికశాతం చెరువులు ఎండిపోయాయి. వర్షాభావంతో భూగర్భజలాలు మరింతగా అడుగంటి రైతులు పంటల సాగుకు స్వస్తి చెప్పే పరిస్థితులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపకాలువలు, ఎత్తిపోతల పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి రబీ సీజన్‌కైనా చెరువులకు జలకళ వస్తుంది.