Share News

జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:22 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న టీడీపీ తంబళ్లపల్లె మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డిలను కస్టడీ కోరుతూ ఎక్సైజ్‌ పోలీసులు మదనపల్లె కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ములకలచెరువు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న టీడీపీ తంబళ్లపల్లె మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డిలను కస్టడీ కోరుతూ ఎక్సైజ్‌ పోలీసులు మదనపల్లె కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి(ఏ17), గిరిధర్‌రెడ్డి(ఏ18)లు ఈ నెల 15వ తేదీన మదనపల్లె ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే. దీంతో వీరికి ఈ నెల 28వ తేదీ వరకు న్యాయమూర్తి సుబహాన్‌ రిమాండ్‌ విధించడంతో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా అదే రోజు ఇద్దరు నిందితులను వారం రోజులు కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి వివరాలు రాబట్టాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే నిందితుల తరఫున న్యాయవాదులు కూడా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్‌ పిటీషన్లు రెండు శుక్రవారం మదనపల్లె కోర్టులో విచారణకు వచ్చాయి. దీంతో రెండు పిటిషన్ల విచారణను న్యాయమూర్తి ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Sep 19 , 2026 | 01:22 AM