Share News

వైద్యానికి వెళుతూ కానరాని లోకాలకు..

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:09 AM

అమ్మమ్మకు పక్షపాతం వచ్చింది. తల్లితో కలిసి వైద్యం కోసం యువకుడు కారులో స్వగ్రామం నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును మార్గమధ్యంలో ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది.

వైద్యానికి వెళుతూ కానరాని లోకాలకు..
మృతి చెందిన సంజనమ్మ, అరుణమ్మ

- కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

- ఇద్దరు మహిళల మృతి

గుర్రంకొండ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అమ్మమ్మకు పక్షపాతం వచ్చింది. తల్లితో కలిసి వైద్యం కోసం యువకుడు కారులో స్వగ్రామం నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును మార్గమధ్యంలో ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. గమ్యస్థానం చేరకనే మృత్యు లోకానికి చేరడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హృదయ విదారకమైన ఈ ఘటన గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి చెందిన బాలయ్య భార్య సంజనమ్మ(68) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. బుధవారం అర్ధరాత్రి ఎక్కువ కావడంతో తల్లి అరుణమ్మ(53)తో కలిసి అమ్మమ్మను తీసుకుని మునేంద్ర(28) కారులో చిత్తూరు జిల్లా పలమనేరు మండలం విరూపాక్షిపురానికి బయలుదేరారు. అర్ధరాత్రి 2.30 గంటలకు గుర్రంకొండ సమీపంలోని చిట్టిబోయినపల్లె వద్ద బెంగుళూరు నుంచి రాజంపేట వైపు వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంజనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన అరుణమ్మ, మునేంద్ర, డ్రైవర్‌ ప్రవీణ్‌లను 108లో రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అరుణమ్మ పరిస్థితి విషమంగా మారడంతో కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. ఇద్దరు మహిళల మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Oct 30 , 2026 | 01:09 AM