Share News

నమ్మకంగా ముంచేశాడు

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:20 AM

అతడు 15 ఏళ్లపాటు నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. రూ.లక్ష నుంచి మొదలు పెట్టిన చీటీలను రూ.కోటికి చేర్చాడు. అతడిపై నమ్మకంతో వందలాది మంది చీటీలు వేశారు. చివరకు ఆరు నెలలుగా చీటీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా.. నమ్మకంగా ముంచేసి.. పరారయ్యాడు సతీష్‌. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వి.కోట సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వి.కోట మండలం పాతూరుకు చెందిన సతీష్‌ 2008లో ఆదిత్య ఆటో ఫైనాన్స్‌ ఏర్పాటు చేసి, వాహనాలకు రుణాలిచ్చేవాడు.

నమ్మకంగా ముంచేశాడు

చీటీల పేరుతో రూ.పది కోట్లకుపైగా మోసం

పాతూరుకు చెందిన సతీ్‌షపై కేసు నమోదు

పరారీలో నిందితుడు

రామకుప్పం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అతడు 15 ఏళ్లపాటు నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. రూ.లక్ష నుంచి మొదలు పెట్టిన చీటీలను రూ.కోటికి చేర్చాడు. అతడిపై నమ్మకంతో వందలాది మంది చీటీలు వేశారు. చివరకు ఆరు నెలలుగా చీటీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా.. నమ్మకంగా ముంచేసి.. పరారయ్యాడు సతీష్‌. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వి.కోట సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వి.కోట మండలం పాతూరుకు చెందిన సతీష్‌ 2008లో ఆదిత్య ఆటో ఫైనాన్స్‌ ఏర్పాటు చేసి, వాహనాలకు రుణాలిచ్చేవాడు. 2015లో చీటీలు మొదలు పెట్టాడు. రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు చీటీలు వేస్తూ.. పలమనేరు, కుప్పం నియోజకవర్గాలతో పాటు, కర్ణాటక సరిహద్దు గ్రామాలు, బెంగళూరు శివారు ప్రాంతాల ప్రజల్లో నమ్మకం పెంచుకున్నాడు. ముఖ్యంగా ఆర్థిక స్థితిమంతులు అతడిని నమ్మి భారీగా చీటీలు వేయసాగారు. దీంతో 2020 నుంచి.. రూ.30లక్షల నుంచి రూ.కోటి వరకు చీటీలు నడపడం ప్రారంభించాడు. ఏడాదిగా చీటీలు పాడిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టేవాడు. ఆరునెలలుగా చీటీలు పాడిన ఏ ఒక్కరికీ డబ్బులివ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అతడు ఇటీవల చిత్తూరులో ఎస్పీని కలిసి ఓ వినతిపత్రం ఇచ్చాడు. ‘నా భార్య క్యాన్సర్‌వ్యాధితో మృతి చెందింది. పిల్లలకు ఇంకా పెళ్లికాలేదు. దీంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చీటీల వ్యవహారాన్ని నేను చూసుకోలేక పోయాను. సిబ్బంది నన్ను మోసం చేయడంతో చీటీలు పాడినవారికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాను’ అని ఆ వినతిపత్రంలో పేర్కొన్నాడు. అప్పటి నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సతీష్‌ వ్యవహారంపై వి.కోట పోలీసులు విచారణ విచారణ ప్రారంభించారు. రూ.10కోట్లకు పైగానే చీటీలు పాడిన వారికి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల విచారణ విషయం తెలుసుకున్న బాధితులు వి.కోట పోలీస్‌ స్టేషనుకు క్యూకడుతున్నారు.

9 మంది ఫిర్యాదుతో కేసు

రామకుప్పం, వి.కోట మండలాలకు చెందిన 9 మంది బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం సతీ్‌షపై కేసు నమోదు చేసిట్లు సీఐ తెలిపారు. తనకు రూ.30లక్షలు ఇవ్వాలని సయ్యద్‌సజ్జాద్‌, రూ.10లక్షలు చొప్పున ఇవ్వాలని శ్వేత, వసీంఖాన్‌, శీనప్ప, రాఘవరెడ్డి, రూ.18లక్షలు ఇవ్వాలని సుధాకర్‌, రూ.5 లక్షలు వంతున ఇవ్వాలని ఆదినారాయణ, జనార్దన్‌రెడ్డి తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఇప్పటి వరకు సతీష్‌ రూ.10కోట్ల వరకు చీటీల డబ్బులు ఇవ్వాలని తమ విచారణలో తేలిందన్నారు. ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు.

బాధితులను తప్పుదోవ పట్టించేందుకే..

ఇక, ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో సతీష్‌ పేర్కొన్న పలు విషయాలు నమ్మశక్యంగా లేదని సీఐ సోమశేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సిబ్బంది రూ.కోట్లలో మోసం చేస్తుంటే సతీష్‌ చూస్తూ ఉండే రకం కాదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. కేవలం బాధితులను తప్పుదోవ పట్టించేందుకే అలా అవాస్తవాలను ప్రచారం చేయించి ఉండొచ్చన్నారు. పరారీలో ఉన్న సతీ్‌షను అరెస్టు చేసి విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగు చూస్తాయన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 02:20 AM