మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు!
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:43 AM
బండి ఆపించి మరీ భర్త కుత్తుకను తెగకోయిస్తుందో భార్య. ప్రియుడితో కలిసి కన్నబిడ్డనే బ్లేడ్లతో కసితీరా గాట్లు పెడుతుందో తల్లి. వృద్ధులైన దంపతులను అంతులేని కక్షతో తెగనరుకుతాడో కుటుంబీకుడు. ఆస్తి, కోరిక, అత్యాశ.. ముప్పేట ముట్టడిలో మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. మానవత్వం ఉన్నవాడు మచ్చుకైనా కానరాకుండా రాక్షసత్వానికి బలైపోతున్నాడు. రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతోంది. కసి కత్తుల వేటలో బంధాలను తెగనరుక్కుంటూ అథఃపాతాళాలవైపు మనిషి ప్రయాణం సాగుతోంది. ఇటు కుప్పం.. అటు వి.కోట.. మధ్యలో రామకుప్పం. కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు హత్యలు. ఒక బాల్య హింస. పరాయివారు కాదు.. చనిపోయిన వారు హంతకులకు హాని తలపెట్టే ఉద్దేశమున్నవారు అసలే కాదు. అయినా చంపేశారు. మామూలుగా కాదు.. పదునైన వేట కత్తులతో కసిగా దాడిచేసి తలలు తెగనరికి ప్రాణాలు తీసేశారు. చనిపోయిన వారిలో ఒకరు దాదాపు యువకుడైతే, ఇద్దరు ఆరవయ్యేళ్లు దాటిన వృద్ధులు. సొంత తల్లిచేత బ్లేడ్ల గాట్లకు గురైన పసవాడి వయసు ఏడేళ్లు.
ఒకరి క్రోధం.. ఇంకెందరికో కన్నీరు
- కుప్పం, ఆంధ్రజ్యోతి
బండి ఆపించి మరీ భర్త కుత్తుకను తెగకోయిస్తుందో భార్య. ప్రియుడితో కలిసి కన్నబిడ్డనే బ్లేడ్లతో కసితీరా గాట్లు పెడుతుందో తల్లి. వృద్ధులైన దంపతులను అంతులేని కక్షతో తెగనరుకుతాడో కుటుంబీకుడు. ఆస్తి, కోరిక, అత్యాశ.. ముప్పేట ముట్టడిలో మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. మానవత్వం ఉన్నవాడు మచ్చుకైనా కానరాకుండా రాక్షసత్వానికి బలైపోతున్నాడు. రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతోంది. కసి కత్తుల వేటలో బంధాలను తెగనరుక్కుంటూ అథఃపాతాళాలవైపు మనిషి ప్రయాణం సాగుతోంది.
ఇటు కుప్పం.. అటు వి.కోట.. మధ్యలో రామకుప్పం. కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు హత్యలు. ఒక బాల్య హింస. పరాయివారు కాదు.. చనిపోయిన వారు హంతకులకు హాని తలపెట్టే ఉద్దేశమున్నవారు అసలే కాదు. అయినా చంపేశారు. మామూలుగా కాదు.. పదునైన వేట కత్తులతో కసిగా దాడిచేసి తలలు తెగనరికి ప్రాణాలు తీసేశారు. చనిపోయిన వారిలో ఒకరు దాదాపు యువకుడైతే, ఇద్దరు ఆరవయ్యేళ్లు దాటిన వృద్ధులు. సొంత తల్లిచేత బ్లేడ్ల గాట్లకు గురైన పసవాడి వయసు ఏడేళ్లు.
ఫ అమ్మాయి హాసినిది శాంతిపురం మండలం బోయనపల్లె. అబ్బాయిది తమిళనాడు రాష్ట్రం శూలగిరి. వీరిద్దరి సంసారానికి గుర్తుగా ఏడాదిన్నరేళ్ల చిన్నారి. అన్యోన్య దాంపత్యం వారిది. కాదు.. అలా అనుకున్నాడా అమాయకుడు. భార్య మాట నమ్మి, ఆమె ‘మొక్కు’ తీర్చడానికి గుడుపల్లె మండలం మల్లప్పకొండకు ద్విచక్ర వాహనంలో పయనమయ్యాడు. వెనుక భార్యాబిడ్డలు. కొండ ఎక్కుతుండగా ఉన్నట్టుండి భార్య చేతిలో హ్యాండ్ బ్యాగు రోడ్డుపై పడిపోయింది. అనుమానం ఎందుకొస్తుంది.. కట్టుకున్న భార్య కదా. బండి ఆపాడు. కట్ చేస్తే.. పొదల మాటున అంతదాకా దాగివున్న భార్య హాసిని ప్రియుడు గంగాధర్, సహచరులతో కలిసి కసిగా కత్తులతో నరికి చంపేశారు. ఆ భార్య నిజమైన ‘మొక్కు’ ఇలా తీరింది. 14వ తేదీన జరిగిందీ దారుణ ఘటన.
ఫ వెంకటేశు, పార్వతమ్మ.. వృద్ధ దంపతులు. రామకుప్పం మండలం వీరిది. ఇద్దరు కొడుకులు, వారికి బిడ్డలు. తల్లిదండ్రులు, కొడుకుల కుటుంబాల మధ్య ఆస్తుల పంపకం.. విభేదాలను పెంచి పోషించింది. ఆ విభేదాలు కక్షలై బుసలు కొట్టాయి. బందార్లపల్లెలో బోరు మోటారు మెకానిక్ షాపు చూసుకుని రాత్రివేళ రామకుప్పంలోని ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను.. వారి కుటుంబీకుడే (మైనర్ అంటున్నారు) మరికొందరితో కలిసి అటకాయించాడు. కట్ చేస్తే.. తలలు, శరీర భాగాలు తెగి వృద్ధ దంపతులు నేలకూలి ప్రాణాలు వొదిలారు. ఈనెల 17వ తేదీన జరిగిందీ అమానుష ఘటన.
ఫ ఆ తల్లి పేరు ఇంద్రజ. ఏడేళ్ల కొడుకు విశాల్ ఉన్నాడు. భర్త గతించి రెండేళ్లైంది. రాజు అనే వ్యక్తితో ఏర్పడ్డ ఫేస్‌బుక్ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. వి.కోటలో కాపురం పెట్టారు. వారి ‘అక్రమానికి’ పిల్లాడు అడ్డుగా ఉన్నాడు. దీంతో ప్రియుడితో కలిసి ఆ తల్లి కన్నబిడ్డ శరీరంపై బ్లేడ్ల గాట్లు పెట్టింది. ఈ అమానవీయ ఘటన ఈనెల 16వ తేదీన వి.కోటలో చోటు చేసుకుంది.
.. ఈ మూడు ఘటనలూ మనుషుల్లో మృగ్యమవుతున్న మానవత్వానికి ప్రత్యక్ష తాజా నిదర్శనాలు. మానవ సంబంధాల్లో పెచ్చరిల్లుతున్న కామ క్రోఽధ లోభ మోహ మద మాత్సర్యాలకు పరాకాష్ట.
కావాలంటే వదిలేయొచ్చు.. కానీ..!
ఈ కేసుల్లో.. కాదనుకున్న వారిని కాదని ఈవలకు వచ్చేయగలిగే అవకాశమున్నా హతమార్చడం. మల్లప్పకొండ హత్య కేసులో ఏ-2గా అరెస్టయిన హాసినికి, ఏ-1 గా అరెస్టయిన ఆమె ప్రియడు గంగాధర్‌కు ఆమె పాఠశాల రోజుల్లోనుంచే సంబంధముంది. అయినా 2024లో సుమారు 18 ఏళ్ల వయసులో తమిళనాడుకు చెందిన రమే్‌షతో ఆమెకు వివాహమైంది. తల్లిదండ్రులకు కూడా ఆమె ప్రేమ వ్యవహారం తెలుసు. ఆ ప్రేమను వారు అంగీకరించి ఉన్నా, హాసిని వేరే వ్యక్తితో పెళ్లికి నిరారించి ఉన్నా రమేష్ బతికిపోయేవాడు. కానీ అలా జరగలేదు. పైగా ఎదురుకట్నంగా రూ.2 లక్షలు ఇచ్చి మరీ ఆమెను అతడు వివాహం చేసుకున్నాడని చెబుతున్నారు. పోనీ, పెళ్లి తర్వాతైనా ‘నువ్వు నాకొద్దు, నేను ప్రేమికుడితో వెళ్లిపోతాను’ అని ఆమె వెళ్లిపోయి ఉన్నా దారుణం చోటుచేసుకునే కాదు. బిడ్డ కూడా పుట్టాక, అన్యోన్యంగా ఉన్నట్లు నటించి మరీ దగ్గరుండి భర్తను కత్తులతో నరికించి చంపేయడం తీవ్ర విషాదం.
ఫ ఇక, వృద్ధ దంపతుల హత్య విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇంకా మూతిమీద మీసాలు కూడా సరిగా రాని మైనర్‌గా భావిస్తున్న.. చదువుకుంటున్న వాడు.. కసితీరా నరికి చంపాడంటే వాడి తల్లిదండ్రులు ఆ పిల్లవాడి మనసులో ఎంత విషం నింపి వుండాలి? ఆస్తిపాస్తుల గొడవలు తేల్చుకోవడానికి పెద్ద మనుషులతో పంచాయితీ నడపొచ్చు. లేదా కోర్టుకు వెళ్లి న్యాయం కోరవచ్చు. ఇలా జరిగి ఉంటే ఆ వృద్ధ దంపతులు బతికిపోయేవారు.
ఫ ఇక, ఏడేళ్ల చిన్నారి తన వివాహేతర సంబంధానికి ఎలా అడ్డవుతున్నాడని అనుకున్నదో ఆ తల్లి. ఒకవేళ అంతగా అడ్డొస్తున్నాడని అనుకుంటే కొడుకును హాస్టల్‌లో వేయవచ్చు. తనకు దూరంగా ఉంచి చదివించి వాడి బాగోగులు చూడొచ్చు. కానీ అలా జరగలేదు. చచ్చేంత స్థాయిలో దారుణంగా కన్న కొడుకును బ్లేడ్లగాట్లకు గురిచేసిన ఆ తల్లి కడుపుతీపికి మాయనిమచ్చగా మిగిలిపోయింది.
ఇప్పుడేం బావుకున్నారు?
గొడవలు, కక్షలతో కనీసం రక్తసంబంధాలనూ చూడకుండా, అంతదాకా పంచుకున్న ప్రేమాప్యాయతలు తలవకుండా కత్తులతో కసితీరా నరికేశారు. హంతకులుగా నిందలు పడ్డవారు కానీ, వారికి సహకరించిన వారు కానీ ఇప్పుడేం బావుకున్నారు? కోరుక్నున వారితో ఆ వివాహేతర సంబంధాలు సంతోషంగా కొనసాగించగలుగుతున్నారా? ఆస్తిపాస్తులు పొంది ఆనందంగా అనుభవించగలుగుతున్నారా? లేదుకదా. పోలీసుల పరిశోధనలో చిక్కిపోయారు. అరెస్టయి జైళ్లలో ఊచలు లెక్కపెడుతున్నారు.. లెక్కపెట్టబోతున్నారు. వారికిప్పుడు ఏ సంతోషాలు దక్కాయి? ఏ ఆనందాలు చిక్కాయి? క్షణికావేశాలు, క్షణికమైన కోరికలు జీవితాలను బలికోరుకుంటాయి. కుటుంబాలను అస్త్యవస్తం చేస్తాయి.
ఇది నగ్న సత్యం.
ఎప్పుడైనా.. ఎక్కడైనా ఇదే వాస్తవం.