హంద్రీనీవా జలాలను తాగునీటికే వాడాలి
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:22 AM
మదనపల్లె జిల్లాకు రానున్న హంద్రీనీవా జలాలను తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవడం లేదని, జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాకు రానున్న హంద్రీనీవా జలాలను తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవడం లేదని, జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. దీన్ని నివారించడానికి నంద్యాల జిల్లా మాల్యాల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోందని తెలిపారు. పీటీఎం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లె, పుంగనూరు మండలాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుస్తామని పేర్కొన్నారు. హంద్రీనీవా కాలువ వెళ్లే మార్గంలో ఈ నీటిని అనధికారికంగా రైతులు పంపింగ్ చేయడం, సైఫనింగ్ చేయడం ద్వారా వ్యవసాయానికి వినియోగించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మదనపల్లె మండలం చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజి ట్యాంకుల్లో వినాయక నిమజ్జనాలు నిషేధించామని, ప్రజలు సహకరించాలని కోరారు.
సుఖశాంతులు వెల్లివిరియాలి
వినాయకచవితి సందర్భంగా జిల్లాలోని ప్రజలు, అధికారులు సుఖశాంతులతో ఉండాలని మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ నిశాంత్‌కుమార్ వేర్వేరు ప్రకటనల్లో కోరారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగించుకుని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.