Share News

చిత్తూరుకు హంద్రీ- నీవా నీళ్లు

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:36 AM

హంద్రీనీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కృష్ణాజలాలను కుప్పానికి తెచ్చి గతేడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు జలహారతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కృష్ణాజలాలను హంద్రీ-నీవాకు సంబంధించి నీవా బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా చిత్తూరుకు తెస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తవ్వగా, పెండింగ్‌ పనుల కోసం రూ.105 కోట్లను కేటాయించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

చిత్తూరుకు హంద్రీ- నీవా నీళ్లు
నీవా బ్రాంచి కాలువ

తాజాగా పెండింగ్‌ పనులకు రూ.105 కోట్ల కేటాయింపు

నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచే కళ్యాణిడ్యాంకూ జలాలు

చిత్తూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కృష్ణాజలాలను కుప్పానికి తెచ్చి గతేడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు జలహారతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కృష్ణాజలాలను హంద్రీ-నీవాకు సంబంధించి నీవా బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా చిత్తూరుకు తెస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తవ్వగా, పెండింగ్‌ పనుల కోసం రూ.105 కోట్లను కేటాయించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

122 కిలోమీటర్ల నీవా బ్రాంచి కెనాల్‌

హంద్రీనీవా మెయిన్‌ కెనాల్‌ 554 కిలోమీటర్లు ప్రయాణించి, కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ వద్ద ముగుస్తుంది. నీవా బ్రాంచ్‌ కెనాల్‌ అనేది మెయిన్‌ కెనాల్‌ ముగిసిన అడవిపల్లె నుంచి ప్రారంభమవుతుంది. చిత్తూరు ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో.. అడవిపల్లె నుంచి చిత్తూరు వరకు 122 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. దీంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 57,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ నీవా బ్రాంచ్‌ కెనాల్‌ పనుల్ని 2014-19 మధ్య టీడీపీ ఉన్నప్పుడే సీఎం చంద్రబాబు ప్రారంభించగా, వైసీపీ ఐదేళ్లు పట్టించుకోలేదు. ప్రస్తుతం నీవా బ్రాంచ్‌ కెనాల్‌ పనులు 80 శాతం పూర్తవ్వగా, మిగిలిన పనుల కోసం రూ.105 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆ నిధుల్ని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తయిన 80 శాతం పనులకు రూ.253 కోట్లను ఖర్చు చేశారు.

మొత్తంగా హంద్రీ నీవాకు రూ.1323 కోట్లు

అన్నమయ్య జిల్లాలోని హంద్రీనీవా మెయిన్‌ కెనాల్‌ పనులు (490 కిలోమీటర్ల నుంచి 554 కి.మీ వరకు), నీవా బ్రాంచ్‌ కెనాల్‌ పనులు (122 కిలోమీటర్లు).. మొత్తం కలిపి రూ.573.68 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.105 కోట్లు నీవా కెనాల్‌ కోసం కాగా, మిగిలిన నిధులతో మెయిన్‌ కెనాల్‌ పెండింగ్‌ పనులు చేపడుతారు. అలాగే సత్యసాయి జిల్లాలోని మెయిన్‌ కెనాల్‌ పెండింగ్‌ పనుల కోసం కూడా రూ.750 కోట్లను కేటాయించారు.

నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి కళ్యాణిడ్యామ్‌ వరకు

నీవా బ్రాంచ్‌ కెనాల్‌కు చెందిన 59వ కిలోమీటరు వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేసి సుమారు 10 మీటర్లపైకి నీళ్లను లిఫ్ట్‌ చేస్తారు. అక్కడ్నుంచి 33 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటుచేసి కళ్యాణిడ్యామ్‌ వరకు నీళ్లను తెస్తారు. చంద్రగిరి మండలంలోని 5 చెరువుల్ని నింపడంతో 1150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కళ్యాణిడ్యామ్‌కు 400 ఎంసీఎ్‌ఫటీ నీళ్లు ఇవ్వడంతో తిరుమల, తిరుపతిలోని సుమారు 5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.126 కోట్లను కేటాయించగా, ఈ ఏడాది జనవరిలో సీఎం శంకుస్థాపన చేశారు.

నీవాకు కాంక్రీట్‌ లైనింగ్‌ లేకుంటే కష్టమే

కెనాల్‌లో నీళ్లు ఇంకిపోకుండా వందశాతం ప్రవహించాలంటే కెనాల్‌ చుట్టూ కాంక్రీట్‌ లైనింగ్‌ కచ్చితంగా చేయాల్సిందే. అందుకే రూ.319 కోట్లతో పుంగనూరు, రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్‌ కాలువలకు లైనింగ్‌ పనులు పూర్తి చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.105 కోట్లతో పెండింగ్‌ పనుల్ని మాత్రమే పూర్తి చేయగలరు. కాంక్రీట్‌ పనుల్ని కూడా కచ్చితంగా చేపడితే కెనాల్‌ చివరి వరకు నీళ్లు చేరతాయి. అందులోనూ నీవా కెనాల్‌ నుంచే కళ్యాణిడ్యాంకు నీళ్లను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాంక్రీట్‌ లైనింగ్‌ చేయకుంటే కష్టమే.

హంద్రీ నీవాపై సీఎం ప్రత్యేక దృష్టి

కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెలలోనే కుప్పంలో పర్యటించి హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పరిశీలించారు. వెంటనే నిధులు కేటాయించి పనుల పూర్తికి వేగం పెంచారు. పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు రూ.319 కోట్లు, కుప్పం కెనాల్‌కు రూ.197 కోట్లు కేటాయించి కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు పూర్తి చేయించారు. దీంతో గతేడాది ఆగస్టులో కుప్పానికి వచ్చిన కృష్ణాజలాల్ని జలహారతినిచ్చారు. నియోజకవర్గంలోని 110 చెరువులు కృష్ణమ్మతో నిండాయి.

అన్నమయ్య జిల్లా: నీవా కాలువ పొడవు 60 కిలోమీటర్లు. 25,404 ఎకరాలకు సాగునీరు.

తిరుపతి జిల్లా: 15 కిలోమీటర్ల మేర నీవా బ్రాంచి కాలువ ప్రయాణిస్తుంది. 3,213 ఎకరాలకు సాగునీరు అందనుంది.

చిత్తూరు జిల్లా: నీవా బ్రాంచి కాలువల 47 కిలోమీటర్లు సాగి.. 28,883 ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుంది.

కుప్పంలో పరిశ్రమకు 60 ఎకరాలు

కుప్పం మండలం ఏకార్లపల్లె గ్రామంలో అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్‌ విస్తరణ ప్రాజెక్టును చేపట్టేందుకు మెస్సర్స్‌ హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు 60 ఎకరాలను కేటాయించేందుకు మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కుప్పం ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో అల్యూమినియం ఆధారిత తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.

Updated Date - Aug 19 , 2026 | 01:36 AM