Share News

నేడో రేపో ఆగనున్న హంద్రీ నీవా నీళ్లు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:35 AM

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నేడో, రేపో హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాల ప్రవాహం ఆగిపోనుంది. అదే సమయంలో జీడిపల్లె, చెర్లోపల్లె రిజర్వాయర్లలో నీళ్లు అందుబాటులో ఉండటంతో మరో వారం, పది రోజుల పాటు జిల్లాకు నీటి ప్రవాహం కొనసాగనుంది.

నేడో రేపో ఆగనున్న హంద్రీ నీవా నీళ్లు

శ్రీశైలంలో నిల్వలు తగ్గిన ప్రభావం

జిల్లాలో ఇప్పటికే నిండిన చెరువులు

ఈ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేనట్లే

చిత్తూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నేడో, రేపో హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాల ప్రవాహం ఆగిపోనుంది. అదే సమయంలో జీడిపల్లె, చెర్లోపల్లె రిజర్వాయర్లలో నీళ్లు అందుబాటులో ఉండటంతో మరో వారం, పది రోజుల పాటు జిల్లాకు నీటి ప్రవాహం కొనసాగనుంది. మరోవైపు ఇప్పటికే జిల్లాలోని చెరువులు నిండాయి. దీంతో ఈ సీజన్‌లో రైతులకు సాగునీటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం దాదాపు 838 అడుగులకు తగ్గిపోయింది. దీంతో మాల్యాల పంపుహౌస్‌ వద్ద నీటిని ఎత్తిపోయడానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆదివారం నాటికి రెండు పంపుల ద్వారా 670 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రధాన కాలువలో ప్రవాహం గణనీయంగా తగ్గింది. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియను నిలిపేసే అవకాశముంది. హంద్రీనీవా ప్రధాన కాలువ రెండు దశల్లో ఉంది. తొలి దశ ప్రధాన కాలువలో నీటి ప్రవాహం నిలిచిపోయినా.. రెండో దశ ప్రధాన కాలువలో ప్రవాహం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. అదెలాగంటే.. జీడిపల్లె రిజర్వాయర్‌ నుంచి రెండో దశ ప్రధాన కాలువ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. మొత్తం ప్రధాన కాలువ 554 కిలోమీటర్లు ప్రయాణించి, అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయర్‌ వద్ద ముగుస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులో 260 కి.మీ.ల నుంచి రెండోదశ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ 1170 క్యూసెక్కుల ప్రవాహం సాగుతోంది.

రెండు రిజర్వాయర్లలో 2 టీఎంసీల నీళ్లు

అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువలకు జీడిపల్లె మెయిన్‌ రిజర్వాయర్‌ ప్రధానమైంది. సోమవారం నాటికి ఇక్కడ 1.452 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలం నుంచి సోమవారం 950 క్యూసెక్కుల నీళ్లు జీడిపల్లె రిజర్వాయర్‌కు వచ్చాయి. జీడిపల్లె తర్వాత చెర్లోపల్లె స్టోరేజ్‌ రిజర్వాయర్‌ కూడా ఉంది. ఇక్కడా 0.644 నీళ్లు (0.3 టీఎంసీలు వాడుకోగలిగినవి) ఉన్నాయి. ఇప్పటికిప్పుడు శ్రీశైలంలో నీళ్లను ఆపేసినా, రెండు జిల్లాలకు మరో వారం పది రోజుల పాటు ప్రవాహం తగ్గదు. జీడిపల్లె, చెర్లోపల్లె రిజర్వాయర్ల నీళ్లను సరఫరా చేస్తారు.

కాంక్రీట్‌ లైనింగ్‌ చేయడంతో..

పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాళ్లకు సుమారు రూ.516 కోట్లతో కాంక్రీట్‌ లైనింగ్‌ పనుల్ని పూర్తి చేశారు. దీంతో నీటి ప్రవాహం వేగంగా ఉంది. వృథా కావడం లేదు. గతేడాది ఆగస్టులో చెర్లోపల్లె రిజర్వాయర్‌కు నీళ్లు రాగా, అదే నెలలో 21వ తేదీన కుప్పం బ్రాంచి కెనాల్‌ స్టార్టింగ్‌ పాయింట్‌కు నీళ్లు వచ్చాయి. 25వ తేదీన కుప్పంలోని చిట్ట చివరి చెరువు పరమసముద్రం వరకు నీళ్లు వెళ్లాయి. అంటే నాలుగు రోజుల్లోనే సుమారు 130 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణించాయి. ఆగస్టు 30వ తేదీన సీఎం చంద్రబాబు కుప్పంలో జలహారతి ఇచ్చారు. జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు.

రెండు జిల్లాలకు ఇబ్బంది లేనట్టే..

వాస్తవానికి కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా 110 చెరువులు నింపడం లక్ష్యంకాగా, 130 చెరువుల్ని నింపేశారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పరిధిలోని 80 చెరువులు పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ద్వారా నిండాయి. ఫలితంగా ప్రస్తుతం భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. శ్రీశైలంలో నీళ్లను ఆపేసినా జిల్లా రైతులు ఎలాంటి ఇబ్బందీ కలగదు. మరో ఏడాది పాటు ఇబ్బంది లేకుండా అన్నిరకాల పంటల్ని పండించుకోవచ్చు. అలాగే ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ శ్రీశైలం నీళ్లు హంద్రీనీవా కాలువలోకి వదిలే అవకాశం ఉంది.

ఎలాంటి ఇబ్బంది లేదు

ప్రస్తుతం పుంగనూరు బ్రాంచి కెనాల్‌ (పీబీసీ)లో 315 క్యూసెక్కుల, కుప్పం కెనాల్‌ (కేబీసీ)లో 200 క్యూసెక్కుల దాకా నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం రెండు జిల్లాల్లో అవసరానికి మించి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నీళ్లు ఆగిపోయినా ఇబ్బంది లేదు. నీళ్లు ఆగిపోయాక ఈ నాలుగు నెలల పాటు పీబీసీ, కేబీసీల్లో పెండింగులో ఉన్న చిన్నపాటి పనులు కూడా చేసేస్తాం.

- విఠల్‌ ప్రసాద్‌, హంద్రీనీవా ఎస్‌ఈ, మదనపల్లె

Updated Date - Mar 24 , 2026 | 12:35 AM