తిరుపతిలో జీఎస్టీ అప్పిల్లేట్ అథారిటీ కార్యాలయం
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:10 AM
తిరుపతిలో జీఎస్టీ అప్పిల్లేట్ అథారిటీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు, అలాగే జిల్లాలో హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ విస్తరణకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ విస్తరణకు ప్రోత్సాహకాలు
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు
తిరుపతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జీఎస్టీ అప్పిల్లేట్ అథారిటీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు, అలాగే జిల్లాలో హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ విస్తరణకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం జిల్లాకు సంబంధించిన ఈ అంశాలపై చర్చించింది. జీఎస్టీ పెరిగిన తర్వాత వాణిజ్య పన్నుల వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దానివల్ల కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా నిలిచిపోతోంది. ఈ నేపధ్యంలో త్వరితగతిన వాటిని పరిష్కరించడం కోసం రాష్ట్ర్ట్రవ్యాప్తంగా అప్పిల్లేట్ అథారిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మంత్రివర్గ పరిశీలనకు వచ్చింది. దీనిపై చర్చించిన మంత్రివర్గం రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ముఖ్య నగరాల్లో అప్పిల్లేట్ అథారిటీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో తిరుపతి కూడా వుంది. కాగా ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో చేసిన సిఫారసుల మేరకు చంద్రగిరి మండలం కాశిపెంట్లలోని హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ విస్తరణకు ప్రోత్సాహకాలు అందించే విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. రూ. 209.68 కోట్ల పెట్టుబడితో 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను విస్తరించేలా హెరిటేజ్ సంస్థ ప్రతిపాదించింది. దీనివల్ల ప్లాంట్ విస్తరించడంతో పాటు సంబంధిత ఉత్పత్తుల తయారీ కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రతిపాదించింది.అందులో భాగంగా ఫ్లేవర్డ్ మిల్క్ తయారీ 131 శాతం, పన్నీర్ తయారీ 400 శాతం, నెయ్యి తయారీ ఏకంగా 566 శాతం పెరుగుతుందని వివరించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రివర్గం హెరిటేజ్ సంస్థ విస్తరణకు ఉద్దేశించిన పెట్టుబడి రూ.200 కోట్లు దాటినందున టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం సబ్సిడీ, కరెంటు బిల్లుల మీద యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ, ఐదేళ్ళ పాటు ఎస్జీఎస్టీ రీ ఎంబర్స్‌మెంట్ వంటి ప్రోత్సాహకాలు మంజూరు చేసే ప్రతిపాదనలను ఆమోదించింది.