Share News

పెరుగుతున్న గంజాయి ప్రభావిత నేరాలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:13 AM

చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి మహమ్మారి మాత్రం ఆరోగ్యంతో పాటు మానవీయ విలువల్నీ మంటగలుపుతోంది. మృగాలతో కూడా పోల్చలేని స్థాయికి దిగజార్చుతోంది. పసి పిల్లల్ని, పండు ముసలివారిని సైతం కడతేర్చడానికీ వెనుకాడని కసాయి కామాంధులుగా మార్చేస్తోంది.

  పెరుగుతున్న గంజాయి ప్రభావిత నేరాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితిపై ఫోకస్‌

దూమ,మద్యపానం వంటి దురలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. వ్యక్తిగతంగా, కుటుంబానికి నష్టం కలిగిస్తాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి మహమ్మారి మాత్రం ఆరోగ్యంతో పాటు మానవీయ విలువల్నీ మంటగలుపుతోంది. మృగాలతో కూడా పోల్చలేని స్థాయికి దిగజార్చుతోంది. పసి పిల్లల్ని, పండు ముసలివారిని సైతం కడతేర్చడానికీ వెనుకాడని కసాయి కామాంధులుగా మార్చేస్తోంది. దురదృష్టవశాత్తూ పిల్లల నుంచి పెద్దల వరకు దీని ప్రభావానికి లోనవుతున్నారు. బానిసలుగా మారుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతున్న కొన్ని గంజాయి ప్రేరేపిత ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

చిన్నారిని చిదిమేశాడు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లెలో గంజాయికి అలవాటు పడిన కులవర్ధన్‌.. ఏడేళ్ల బాలికను హత్యాచారం చేసిన వైనం ఒక్కసారిగా ప్రజానీకాన్ని ఉలికిపడేలా చేసింది. స్పృహ లేకుండా బాలిక మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో పడేసి అక్కడే రాత్రంతా పడుకున్న తీరు గంజాయి మత్తు కలిగించే వినాశకర స్థితిని కళ్లకు కడుతోంది.

భర్త అత్యాచారం చేస్తే భార్య వీడియో తీసి..

కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి (22) తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కోర్సు చేస్తుంది. తోటి విద్యార్థిని ప్రణవకృష్ణ (35)తో ఆమెకు స్నేహం కుదిరింది. దీంతో ఆ యువతి ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది. గంజాయి అలవాటు ఉన్న ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణకిషోర్‌రెడ్డి.. ఆ యువతికీ గంజాయి ఇచ్చారు. ఆ మత్తులో ఉన్న ఆమెను కిషోర్‌రెడ్డి అత్యాచారం చేయగా, ప్రణవకృష్ణ వీడియో తీసింది. తర్వాత వీడియోను యువతి కుటుంబ సభ్యులకు పంపించి, డబ్బులు డిమాండ్‌ చేశారు. 2024 జూలైలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల్ని అరెస్టు చేశారు.

మత్తు ఎక్కువై.. రైలు పట్టాలపైనే..

2024 అక్టోబరులో పీలేరుకు చెందిన కిరణ్‌, యాసిన్‌ అలీ అనే యువకులు గంజాయి మత్తులో పట్టాలపై ఉన్నారు. ఈక్రమంలో రైలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది డిసెంబరులో కలికిరి రైల్వేట్రాక్‌పై ఇదే తరహాలో సోమలకు చెందిన మునికుమార్‌, కలికిరికి చెందిన వీరభద్రయ్యలు కూడా మరణించారు.

మత్తులో అసభ్య ప్రవర్తన

జీడీనెల్లూరు మండలం కొండకిందవూరు సమీపంలో ఆరుగురు యువకులు గతనెలలో మద్యం, గంజాయి మత్తులో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

గంజాయితో నష్టాలెన్నో?

గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్‌ (టీహెచ్‌సీ) రసాయనం మత్తును పెంచుతుంది.

పీల్చిన వెంటనే టీహెచ్‌సీ రక్తంతో పాటు మెదడుకు చేరుకుంటుంది. అక్కడి న్యూరాన్లు అదుపు తప్పుతాయి.

బైపోలార్‌ డిజార్డర్‌ సమస్య తలెత్తుతుంది

నిరాశ, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయి.

క్యాన్సర్‌ ముప్పు అధికంగా ఉంటుంది.

ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుంది.

జ్ఞాపకశక్తి, తెలివితేటలు తగ్గిపోతాయి.

అధిక మోతాదులో తీసుకున్నప్పుడు. ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో అనే భయం వెంటాడుతుంది.

చాలావరకు తగ్గింది.. ఇంకా తగ్గిస్తాం

గంజాయికి బానిసగా మారిన వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుంది. తీవ్ర బానిసలుగా మారినవారితో సమాజానికి నష్టం కూడా కలుగుతుంది. తీవ్ర నేరాలకూ పాల్పడతారు. గంజాయికి విద్యార్థులు దూరంగా ఉండాలి. ఇప్పటికే వాడకం చాలావరకు తగ్గుతోంది. మరితం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి అమ్ముతున్నా, వినియోగిస్తున్నా పోలీసులకు సమాచారమివ్వండి.

- తుషార్‌ డూడీ, చిత్తూరు జిల్లా ఎస్పీ

విచక్షణ కోల్పోతారు

మన వద్ద గంజాయిని స్మోకింగ్‌ విధానంలో తీసుకుంటున్నారు. తొలుత తోటి విద్యార్థులు, స్నేహితుల ద్వారా అలవాటు ప్రారంభమవుతుంది. మోతాదు పెరిగితే ఏం చేయాలి, ఏం చేస్తున్నామనే విచక్షణ ఉండదు. మర్డర్‌, రేప్‌ వంటి చర్యలకు పాల్పడతారు. నన్ను ఎవరో ఏదో చేసేస్తారనే ఆలోచనలు ఎక్కువ అవుతాయి. దాంతో వాళ్లు ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేస్తారు. గంజాయిపై అవగాహన కల్పించడానికి ముందే అది ఎక్కడా దొరక్కుండా కట్టడి చేయాలి.

- డాక్టర్‌ దినేష్‌, మానసిక వైద్య నిపుణుడు,

అపోలో ఆస్పత్రి, చిత్తూరు

సమాజానికి ఏ రకంగానూ పనికిరారు

గంజాయి తీసుకునేవారు ఏ పనీ చేయరు. ఎవరితో కలవరు. ఇంట్లో చిల్లర దొంగతనాలు చేస్తారు. అడిగింది ఇవ్వకుంటే క్రిమినల్‌, యాంటీ సోషల్‌ యాక్టివిటీ్‌సలో పాల్గొంటారు. పక్కనున్న వారికీ అలవాటు చేయించి పాడు చేస్తారు. నార్మల్‌ అయ్యేవరకు ఏరకంగానూ పనికిరారు. అలాంటి వారు సడన్‌గా ఎవరితోనూ కలవకుండా, తేడాగా మారిపోతే గుర్తించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. కచ్చితంగా మందులు వాడాలి. తల్లిదండ్రుల సపోర్టు బాగుంటే త్వరగా కోలుకుంటారు.

- డాక్టర్‌ అనుపమ, క్లినికల్‌ సైకాలజిస్ట్‌,

అమరా హాస్పిటల్‌, తిరుపతి

Updated Date - Feb 19 , 2026 | 01:13 AM