Share News

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - May 15 , 2026 | 01:09 AM

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం జిల్లాకు సంబంధించి పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

-రూ.2508 కోట్ల పెట్టుబడితో 3వేలమందికి ఉద్యోగావకాశాలు

-రూ. 6100 కోట్లతో అపోలో టైర్స్‌ విస్తరణకు అనుమతి

-పలు అభివృద్ధి ప్రతిపాదనలకూ మంత్రివర్గ ఆమోదం

తిరుపతి, మే 14 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం జిల్లాకు సంబంధించి పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరులో నడుస్తున్న అపోలో టైర్స్‌ పరిశ్రమ రూ. 6100 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న నాలుగో దశ విస్తరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.దీంతో మరో వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. సత్యవేడు మండలంలో గ్రీన్‌ ఫీల్డ్‌ మోటర్‌ సైకిల్‌ తయారీ ప్రాజెక్టు కింద రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్‌) పరిశ్రమ ఏర్పాటుకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. రూ. 2508 కోట్ల పెట్టుబడితో 3 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ చేసిన సిఫారసులను మంత్రివర్గం ఆమోదించింది.అనధికారిక సమాచారం ప్రకారం సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామ పరిధిలో 267 ఎకరాలను ఈ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించనుంది.

ఇరుగుళంలో పారిశ్రామిక వాడ

ఏర్పాటుకు ఏపీఐఐసీ 9.83 ఎకరాలు

సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుంది. పరిశ్రమల శాఖ రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఆ గ్రామం సర్వే నంబరు 4-7 తదితరాల్లో 9.83 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయించేందుకు అంగీకరించింది. సంబంధిత భూమిని ఏపీఐఐసీ అభివృద్ధిచేసి పరిశ్రమల ఏర్పాటుకోసం పార్కు సిద్ధం చేయనుంది. 2017 మార్చి 16వ తేదీ నాటి జీవో నంబరు 106 ప్రకారం ఈ భూమిని ఏపీఐఐసీకి పూర్తి ఉచితంగా కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది.

మేనకూరులో బయో గ్యాస్‌ ప్లాంట్‌

నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌లో బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం అనుమతించింది. ఎనర్జియా బయో ఫ్యూయెల్స్‌ ఎల్‌ఎల్‌పి సంస్థ చేసిన అభ్యర్థన మేరకు మేనకూరు సెజ్‌లో 12 టీపీడీ సామర్ధ్యంతో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ-2024 పాలసీ కింద ఈ ప్రాజెకును ఆమోదించిన మంత్రివర్గం ప్రోత్సాహకాలను విస్తరించేందుకు కూడా సమ్మతి తెలిపింది.

క్యారియర్‌ ఏసీ పరిశ్రమకు పలు రాయితీలు

శ్రీసిటీలో అడ్వాన్డ్స్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మరియు రిఫ్రిజిరేషన్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి క్యారియర్‌ సంస్థ చేసిన అభ్యర్థనను మంత్రివర్గం ఆమోదించింది. రూ. 863 కోట్ల పెట్టుబడితో 721మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలను విస్తరించేందుకు కూడా మంత్రివర్గం అంగీకరించింది. ఈ ప్రాజెక్టును ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ (4.0) 2024-29 పాలసీ కింద పరిగణనలోకి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. ఇప్పటికే హెచ్‌వీఏసీ తయారీకి జిల్లా కీలక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్యారియర్‌ ఏసీ యూనిట్‌ కూడా రానుండడంతో ఏసీల తయారీ రంగంలో జిల్లా స్థానం మరింత మెరుగుపడనుంది.

ఇతర ప్రతిపాదనలకూ ఆమోదం

మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. స్పేస్‌ సిటీకి సంబంధించి ఎస్‌ఐపీబీ సిఫారసుల మేరకు పరిశ్రమల శాఖ రెండు కంపెనీలతో కుదుర్చుకున్న సేల్‌ అగ్రిమెంట్లలో నిబంధనలు సవరించడానికి అనుమతి లభించింది. స్కై రూట్‌ ఏరో స్పేస్‌ సంస్థ విషయంలో సేల్‌ అగ్రిమెంట్‌లో వున్న పెరిగిన పరిహారం, మరియు అదనపు ఛార్జీలకు సంబంధించిన నిబందనలను తొలగిస్తూ సంస్థ బాధ్యత కేవలం సేల్‌ కన్సిడరేషన్‌ చెల్లింపులకే పరిమితమని మంత్రివర్గం స్పష్టత ఇచ్చింది. అలాగే ఇథీరియల్‌ ఎక్సప్లొరేషన్‌ గిల్డ్‌ సంస్థ విషయంలో భూసేకరణ ఖర్చుల నుంచీ ఉత్పన్నమయ్యే అభివృద్ధి ఛార్జీలు మరియు పెరిగిన పరిహారం బాధ్యతను ఎకరాకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ పరిమితం చేయడానికి ఆమోదం తెలిపింది. తిరుపతి ఐఐటీ, ఐసర్‌లతో పాటు ప్రభుత్వ యూనివర్శిటీలలో అందుబాటులో వున్న మౌళిక సదుపాయాలను వినియోగించుకుని ఏపీ ఫస్ట్‌ (ఏపీ ఫ్యూచర్‌ ఇన్నోవేషన్‌, రీసెర్చి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) సంస్థను కంపెనీ చట్టం సెక్షన్‌ 8 కింద కంపెనీగా ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం అనుమతించింది.

Updated Date - May 15 , 2026 | 01:09 AM