Share News

జనగణనకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:43 AM

ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల ప్రక్రియ పట్టాలెక్కబోతోంది. 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు సమాయత్తం అవుతున్నారు.

జనగణనకు గ్రీన్‌ సిగ్నల్‌

ముఖ్య జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల ప్రక్రియ పట్టాలెక్కబోతోంది. 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు సమాయత్తం అవుతున్నారు. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత జనగణన-2027 ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జనాభా లెక్క కేవలం అంచనాలకే పరిమితమైంది. ఈ లెక్కింపులో ఉపాధ్యాయులే కీలకభూమిక పోషించేవారు. ఆరు నెలల నుంచి ఏడాది పాటు జరిగే ఈ ప్రక్రియకు టన్నుల కొద్దీ కాగితాలు వినియోగించేవారు. ఈసారి కాగిత రహితంగా డిజిటల్‌ యాప్‌ ద్వారా జనగణన చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్గదర్శకాలు త్వరలో విడుదల అవుతాయని పేర్కొన్నారు.

ప్రత్యేక అధికారుల నియామకం

జనగణనకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. అదనపు జనాభా లెక్కల అధికారిగా జేసీ, జిల్లా జనాభా లెక్కల అధికారిగా డీఆర్వోను నియమించింది. జిల్లా ప్లానింగ్‌ ఆఫీసర్‌, జిల్లా విద్యాశాఖాధికారి, జడ్పీ సీఈవో, సర్వే శాఖ ఏడీ, పంచాయతీరాజ్‌ అధికారి, జిల్లా ఫారెస్టు ఆఫీసర్‌ను జిల్లా అదనపు జనాభా లెక్కల అధికారులుగా నియమించింది. జిల్లా స్టాటస్టిక్స్‌ ఆఫీసర్‌.. జిల్లా జాయింట్‌ జనాభా లెక్కల అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే ఆర్డీవోలు జనాభా లెక్కల అధికారులుగా, మున్సిపాలిటీలలో కమిషనర్లు ముఖ్య జనాభా లెక్కల అధికారులుగా నియమించింది.

Updated Date - Jan 12 , 2026 | 01:43 AM