Share News

‘గ్రీన్‌ ఇంద్ర’ రోడ్డెక్కిందోచ్‌..!

ABN , Publish Date - Aug 19 , 2026 | 02:11 AM

పర్యావరణ హిత, కాలుష్య, శబ్ద రహితంగా నడిచే కన్వెర్షన్‌ ఏసీ ఇంద్ర బస్సు మంగళవారం పూర్తిస్థాయిలో రోడ్డెక్కింది

‘గ్రీన్‌ ఇంద్ర’ రోడ్డెక్కిందోచ్‌..!
కాణిపాకం ప్లాట్‌ఫామ్‌ వద్ద గ్రీన్‌ ఇంద్ర

తిరుపతి అర్బన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ హిత, కాలుష్య, శబ్ద రహితంగా నడిచే కన్వెర్షన్‌ ఏసీ ఇంద్ర బస్సు మంగళవారం పూర్తిస్థాయిలో రోడ్డెక్కింది. గతేడాది పాత సూపర్‌ లగ్జరీ బస్సును ఎంపిక చేసుకొని కల్యాణి పవర్‌ట్రైన్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా ఇంధనం నుంచి ఏసీ విద్యుత్‌ బస్సుగా మార్చిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ఈ బస్సు తిరుపతికి చేరింది. రిజిస్ర్టేషన్‌, రోడ్డు కన్వెర్షన్‌, ఇతర అనుమతులు పొందిన తర్వాత గత నెల 24న తిరుపతి నుంచి కాణిపాకానికి ట్రయల్‌గా నడిపారు. అనివార్య కారణాలతో అధికారిక ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. డిపోలో ఖాళీగా ఉంచడం కంటే ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తే ప్రయోజనం చేకూరుతుందని భావించారు. గత ఆదివారం కాణిపాకానికి రెండు ట్రిప్పులు నడిపారు. చిన్నచిన్న లోపాలు ఎదురయ్యాయి. సోమవారం గ్యారేజీకి తీసుకెళ్లి ఆ లోపాలను సరిదిద్దారు. పూర్తిస్థాయిలో చార్జింగ్‌ నింపుకొని మంగళవారం ఉదయం 11.50గంటలకు సీబీఎ్‌సలోని కాణిపాకం ప్లాట్‌ఫామ్‌ నుంచి 22 మందితో బయల్దేరింది. మధ్యాహ్నం 1.20గంటలకు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. అక్కడి నుంచి చిత్తూరుకు వెళ్లి కంపెనీ తరపున స్వల్ప తనిఖీలు పూర్తి చేసుకొని సాయంత్రం 4గంటలకు కాణిపాకం చేరుకుంది. అక్కడి నుంచి 20మందితో బయల్దేరి తిరుపతి బస్టాండుకు 5.30గంటలకు చేరుకుంది. గ్రీన్‌ ఇంద్ర ఏసీ బస్సులో సరికొత్త అనుభూతి కలుగుతోందని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Aug 19 , 2026 | 02:11 AM