Share News

‘గ్రీన్‌ ఇంద్రా’ వచ్చిందోచ్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:49 AM

పర్యావరణహితమే ధ్యేయంగా ప్రయోగాత్మకంగా తయారుచేసిన గ్రీన్‌ ఇంద్రా ఏసీ బస్సు గురువారం ఉదయం తిరుపతికి చేరుకుంది.

‘గ్రీన్‌ ఇంద్రా’ వచ్చిందోచ్‌
మంగళం డిపోలో గ్రీన్‌ ఇంద్రా ఏసీ బస్సు

తిరుపతి అర్బన్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): పర్యావరణహితమే ధ్యేయంగా ప్రయోగాత్మకంగా తయారుచేసిన గ్రీన్‌ ఇంద్రా ఏసీ బస్సు గురువారం ఉదయం తిరుపతికి చేరుకుంది. కాలపరిమితి మిగిలి ఉండి పాడైపోయిన సూపర్‌లగ్జరీ బస్సులను ఏం చేయాలని ఆలోచిస్తున్న వేళ పుణేకు చెందిన కల్యాణి పవర్‌ట్రైన్‌ లిమిటెడ్‌ సంస్థ తక్కువ ఖర్చుతో పాత బస్సులను రెట్రీఫిట్మెంట్‌ ద్వారా నవీకరణ చేస్తామని ముందుకొచ్చింది. ఈ క్రమంలో 2014లో వచ్చిన సూపర్‌ లగ్జరీ బస్సును ఎంపిక చేసుకుని విజయవాడలోని వారి వర్క్‌షాప్‌కు తరలించారు. ఇంజన్‌, గేర్‌, ఇంధనం బాక్సులు, పొగగొట్టం తొలగించి ఎలక్ట్రిక్‌ స్టీరింగ్‌, కంప్రెషర్‌, బ్యాటరీలు, కూలింగ్‌సిస్టమ్‌, ఏసీయూనిట్‌, బటన్‌ గేర్‌ సిస్టమ్‌లను అమర్చారు. దీనికోసం దాదాపు రూ.70లక్షలు ఖర్చుపెట్టారు. మరో రూ.20లక్షలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో కూడిన బాడీని ఏర్పాటు చేశారు. దీనివల్ల రూ.2కోట్లు వ్యయం అయ్యే స్థానంలో కేవలం రూ.90లక్షలకే గ్రీన్‌ఇంద్రా ఏసీ బస్సు రూపం దాల్చింది. అన్నిరకాల పరీక్షలు చేశాక బుధవారం రాత్రి విజయవాడలో బయల్దేరి గురువారం ఉదయం మంగళం డిపోకు చేరుకుంది. కరకంబాడి రోడ్డులో కొంతదూరం నడిపి కంపెనీ ప్రతినిధుల ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు బస్సు ఆపరేషన్‌పై అవగాహన తెచ్చుకున్నారు. కాగా, 256 కేవీ బ్యాటరీ, 150 కేవీ ఎలక్ట్రిక్‌ మోటార్‌, గంటన్నర వ్యవధిలో రీచార్జి, 230-250కిలోమీటర్ల దూరం వరకు 80కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. 20టన్నుల బరువుతో సునాయాసంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. త్వరలో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి బస్సును తిరుపతి డిపోకు కేటాయించనున్నారు. తిరుపతి-నెల్లూరు మధ్య కొన్ని రోజులపాటు ప్రయోగాత్మకంగా నడపనున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:49 AM