Share News

మంగళంలో ‘గ్రీన్‌ బస్సు డిపో’

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:05 AM

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ మంగళం గ్యారేజీలో ‘గ్రీన్‌ బస్సు డిపో’ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అలిపిరి డిపో కేంద్రంగా వంద ఎలక్ర్టిక్‌ బస్సులు నడుస్తూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో తిరుమలకు పూర్తిస్థాయిలో ఎలక్ర్టిక్‌ బస్సులు తిప్పాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

మంగళంలో ‘గ్రీన్‌ బస్సు డిపో’

జోరుగా సాగుతున్న నిర్మాణ పనులు

జనవరిలో ప్రారంభానికి సన్నాహాలు

తిరుపతి అర్బన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ మంగళం గ్యారేజీలో ‘గ్రీన్‌ బస్సు డిపో’ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అలిపిరి డిపో కేంద్రంగా వంద ఎలక్ర్టిక్‌ బస్సులు నడుస్తూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో తిరుమలకు పూర్తిస్థాయిలో ఎలక్ర్టిక్‌ బస్సులు తిప్పాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళం డిపోను ఎంపికచేసి.. పూర్తిగా గ్రీన్‌ బస్సు డిపోగా మార్చేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అద్దె ప్రాతిపదికన నడపడానికి ఈకా కంపెనీ ఇప్పటికే ఎంవోయూ చేసుకుంది. పినాకిల్‌ మొబిలిటీ సొల్యూషన్‌ సంస్థలో తయారయ్యే 50 ఎలక్ర్టిక్‌ బస్సులను ఇప్పటికే ఆర్డర్‌ చేసింది. అలాగే ఆర్టీసీ ద్వారా చేపట్టాల్సిన సివిల్‌, ఎలక్ర్టిక్‌ పనులు దాదాపు రూ.10కోట్ల వ్యయంతో నెల కిందట మొదలయ్యాయి. ప్రస్తుతం డిపో ఆవరణంలో చార్జింగ్‌ మెషిన్లు అమర్చే పిల్లర్లు, 33కేవీ సబ్‌స్టేషన్‌, రెండు డిపోలుగా వేరుచేసే ప్రహరీ నిర్మిస్తున్నారు. అలాగే రూ.10లక్షల వ్యయంతో మరుగుదొడ్లు, వాటర్‌ట్యాంక్‌, వాషింగ్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారం కిందటే ఎనిమిది చార్జింగ్‌ మెషిన్లు వచ్చాయి. వీటి ద్వారా ఏకకాలంలో 16బస్సులు చార్జింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఏడు ఎకరాల విస్తీర్ణం ఉంది. ప్రస్తుతానికి గ్రీన్‌ బస్సు డిపో-1కు 3.24ఎకరాలు, రెండో డిపోకు 2.86ఎకరాల స్థలం కేటాయించారు. పనులు జరుగుతున్న దృష్ట్యా స్థలాభావం ఏర్పడుతుందని డిపో పరిధిలో నడుస్తున్న 94 బస్సుల్లో నెల కిందటే 67 బస్సులను తిరుపతి, అలిపిరి, చిత్తూరు డిపోలకు తరలించారు. ఈ నిష్పత్తి ప్రకారం సిబ్బందిని కూడా బదిలీ చేశారు. ప్రస్తుతం 27 సప్తగిరి బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.

Updated Date - Jul 27 , 2026 | 02:05 AM