మరింత వేగం... పారదర్శకం
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:26 AM
నూతన లగేజీ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలందించడంతో పాటు లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జీఎంఆర్, టీటీడీ ఐటీ విభాగ అధికారులకు సూచించారు.లగేజీ నిర్వహణ వ్యవస్థలో తీసుకురానున్న మార్పులపై ఆయన మంగళవారం తిరుమల పద్మావతి అతిథిగృహంలో జీఎంఆర్ ప్రతినిఽధులు, టీటీడీ ఐటీ విభాగం అధికారులతో సమీక్షించారు.
మారనున్న శ్రీవారి భక్తుల లగేజీ నిర్వహణ
టీడీ ఏఈవోకు జీఎంఆర్ ప్రతినిధుల పవర్ పాయింట్ ప్రజంటేషన్
తిరుమల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): నూతన లగేజీ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలందించడంతో పాటు లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జీఎంఆర్, టీటీడీ ఐటీ విభాగ అధికారులకు సూచించారు.లగేజీ నిర్వహణ వ్యవస్థలో తీసుకురానున్న మార్పులపై ఆయన మంగళవారం తిరుమల పద్మావతి అతిథిగృహంలో జీఎంఆర్ ప్రతినిఽధులు, టీటీడీ ఐటీ విభాగం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ప్రతినిధులు నూతన విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆధునిక బీఎల్‌ఈ 5.1 సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించిన ఈ విధానంలో భక్తుల లగేజీని స్వీకరించినప్పటి నుంచి తిరిగి అందజేసే వరకు ప్రతి దశనూ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించవచ్చన్నారు.అలిపిరి వద్ద భక్తుల లగేజీని స్వీకరించినప్పటినుంచి ట్యాగ్‌ను అనుసంధానం చేయడం, వాహనాల ద్వారా తిరుమలకు తరలించడం, జీఎన్‌సీ వద్ద లగేజీని ఉంచడం, భక్తులు తమ లగేజీని తిరిగి తీసుకోవడం వరకు ఎండ్-టూ-ఎండ్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. రోజుకు సుమారు 12 వేల బ్యాగులను, రద్దీ సమయాల్లో గంటకు సుమారు 1,800 బ్యాగులను నిర్వహించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలియజేశారు.ప్రతి లగేజీకి బీఎల్‌ఈ ట్యాగ్‌ను అనుసంధానం చేయడం ద్వారా అది ఏ ప్రాంతంలో ఉందో గుర్తించే విధానం, లగేజీని తిరిగి పొందే సమయంలో క్యూలను తగ్గించేందుకు ముందస్తు రిక్వెస్ట్ చేసే విధానాన్ని జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. జీఎన్సీకి సుమారు వంద మీటర్ల పరిధిలో ఉన్నప్పుడు కియోస్క్ లేదా మొబైల్ యాప్ ద్వారా లగేజీ కోసం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలిపిరి నుంచి జీఎన్సీ వరకు లగేజీ తరలింపును కూడా డిజిటల్ మానిఫెస్ట్, జీపీఎస్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించే విధానాన్ని ప్రతిపాదించారు. లగేజీ నిర్వహణకు సంబంధించిన ఆక్యుపెన్సీ, భక్తుల రాకపోకలు, రద్దీ, సేవలస్థితి తదితర అంశాలను ఒకే కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని వివరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏఈవో వారికి సూచించారు.