Share News

ఇష్టపడి.. కష్టపడి చదివితేనే గొప్ప లక్ష్యాలు సాకారం

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:04 AM

నేనూ తెలుగుమీడియంలో చదివి వెటర్నరీ విద్యలోకి(1985బ్యాచ్‌)ప్రవేశించిన ఆర్డినరీ విద్యార్థినే.

 ఇష్టపడి.. కష్టపడి చదివితేనే గొప్ప లక్ష్యాలు సాకారం
సర్టిఫికెట్లు అందజేస్తున్న కడప కలెక్టర్‌ శ్రీధర్‌, వీసీ జేవీరమణ తదితరులు

తిరుపతి రూరల్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): నేనూ తెలుగుమీడియంలో చదివి వెటర్నరీ విద్యలోకి(1985బ్యాచ్‌)ప్రవేశించిన ఆర్డినరీ విద్యార్థినే. తొలిరోజుల్లో కొన్ని ఇంగ్లీషు పదాలు అంతగా అర్థమయ్యేవికావు.. సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన ప్రణాళికను ఆచరిస్తే గొప్ప విజయాలు మనముంగిట తలవాల్చుతాయని, దీనికి విద్యార్థిగా ఉన్నప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు సరైన ప్రణాళికలు ఆచరించాలని ఎస్వీవెటర్నరీ సైన్స్‌ కళాశాల పూర్వవిద్యార్థి, ప్రస్తుత వైఎస్సార్‌ కడపజిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. కళాశాల ఆడిటోరియంలో 62వ వార్షికోత్సవాన్ని ఆరోహన్‌-2కే26పేరిట సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇష్టపడి, కష్టపడి చదివితే ఎంచుకున్న రంగంలో సునాయాసంగా విజయం సొంతం చేసుకోవచ్చని, విద్యార్థిగా ఓపక్క ఎంజాయ్‌ చేస్తూనే.. మరోపక్క లక్ష్య సాధనదిశగా ప్రణాళికలు ఆచరించాలని సూచించారు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీ జేవీరమణ మాట్లాడుతూ.. కళాశాలలో చదివిన ఎందరో పూర్వవిద్యార్థులు నేడు దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. డీఆర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీలత, డీఎ్‌సఏ డాక్టర్‌ వి.వైకుంఠరావు, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.జగపతిరామయ్య మాట్లాడుతూ.. మూగజీవాలకు సేవచేసే అవకాశాన్ని అదృష్టంగా భావించాలని, పశువైద్య విద్యలో కళాశాలకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి వనరులను వినియోగించుకుని లక్ష్యాలు సాధించుకోవాలన్నారు. ప్రతిభచాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విభాగాల హెడ్లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:04 AM