సత్యవేడులో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:27 AM
సత్యవేడులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొన్నిచోట్ల అడ్డగోలు అనుమతులతో గ్రావెల్ తవ్వి తరలిస్తుంటే, ఇంకొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలకు తెగబడుతున్నారు.
సత్యవేడులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొన్నిచోట్ల అడ్డగోలు అనుమతులతో గ్రావెల్ తవ్వి తరలిస్తుంటే, ఇంకొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలకు తెగబడుతున్నారు. తమిళనాడులో మట్టి, గ్రావెల్ తవ్వకాలపై అక్కడి ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేస్తోంది. దాంతో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు పరిసర ప్రాంతాలపై మాఫియా కన్ను పడింది. ఈ క్రమంలో మేత బీడు భూములను కూడా వదలకుండా తవ్వేసి.. కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.
- సత్యవేడు, ఆంధ్రజ్యోతి
సత్యవేడు మండలం మదనంజేరి సర్వే నెంబరు 186లోని సుమారు 20 ఎకరాల మేతబీడు భూమిలో చెన్నైకి చెందిన ఒక బడా వ్యక్తి తన పలుకుబడితో ఎలాంటి అనుమతుల్లేకుండా రాత్రీపగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలను నెల రోజులుగా జరుపుతున్నాడు. నిత్యం వంద టిప్పర్లకుపైగా గ్రావెల్‌ను చెన్నై శివారు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నాడు. ఇదే మండలంలోని తొండుకుళ్లి సర్వే నెంబరు 180లోని సుమారు ఏడెకరాల మేతబీడులో తమిళనాడుకు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి రోజూ చెన్నైకి తరలించుకుపోతోంది. గతంలో ఇదే భూమిలో తవ్వకాలు జరిపిన ఆ సంస్థ మళ్లీ అక్కడే లోతైన తవ్వకాలు జరుపుతోంది. పశువులు, జీవాల పోషణ కోసం ఏర్పాటు చేసిన మేతబీడులో విచక్షణారహితంగా నిర్వహిస్తున్న తవ్వకాలతో పాడిరైతులు జీవనం కోల్పోతున్నారు.
నియోజకవర్గంలోనూ..
సత్యవేడు నియోజకవర్గంలోని పలు మండలాల్లోనూ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోరంత అనుమతులతో కొండల్నే తవ్వేస్తూ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అనుమతులు ఒకచోట తవ్వకాలు మరో చోట నిర్వహిస్తుండడంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సత్యవేడు మండలంలో తొండుకుళ్లి, వానెల్లూరు, వీఆర్‌కండ్రిగ, కన్నావరం డీకేటీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. నాగలాపురం మండలం టీపీకోట, వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం, విఠలయ్యపాళెం, చిలమత్తూరు పిచ్చాటూరు మండలం తులసీకృష్ణాపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ, డీకేటీ భూముల్లోనూ, చెరువు పొరంబోకు భూముల్లోనూ జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలపై జిల్లా అధికారుల సమగ్ర పరిశీలన జరిపి, అనుమతుల్లేని గ్రావెల్ క్వారీలను రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.