Share News

జోరందుకున్న గ్రావెల్‌, మట్టి తవ్వకాలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:40 AM

సత్యవేడు నియోజకవర్గంలో గ్రావెల్‌,మట్టి తవ్వకాలు మళ్ళీ జోరందుకున్నాయి.వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగిన గ్రావెల్‌ దందాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరపాటు బ్రేక్‌ పడింది.

జోరందుకున్న గ్రావెల్‌, మట్టి తవ్వకాలు
గ్రావెల్‌ తవ్వకాలు

-ఓవర్‌లోడ్‌ టిప్పర్ల రాకపోకలతో

ధ్వంసమైపోయిన గ్రామీణ రోడ్లు

సత్యవేడు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు నియోజకవర్గంలో గ్రావెల్‌,మట్టి తవ్వకాలు మళ్ళీ జోరందుకున్నాయి.వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగిన గ్రావెల్‌ దందాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరపాటు బ్రేక్‌ పడింది. అయితే మళ్లీ గ్రావెల్‌ తవ్వకాలు ఊపందుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పక్కనున్న తమిళనాడులో భవన నిర్మాణాలు, అభివృద్ధి పనుల కోసం ఇక్కడి గ్రావెల్‌కు చాలా డిమాండ్‌ ఉంది. దీంతో గ్రావెల్‌ మాఫియా అడ్డదారుల్లో అనుమతులు పొంది కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల్లో రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి గ్రావెల్‌ను భారీ స్థాయిలో చెన్నై తరలించి సొమ్ము చేసుకుంటోంది. ఫలితంగా సత్యవేడు, నాగలాపురం మండలాల్లో రహదారులు, గ్రామీణ రోడ్లు ధ్వంసమై ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో మట్టి మాఫియా రెచ్చిపోయి ఎర్రమట్టి, గ్రావెల్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను సొమ్ము చేసుకుని రూ. వందల కోట్లు దోపిడీ చేసి, పచ్చని ప్రకృతిని కనుమరుగు చేశారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తూ కూర్చుంది. ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశించినా అధికారులు మాత్రం నిబంధనలను అమలు చేయలేక పోయారు. ఫలితంగా నియోజకవర్గంలో రహదారులు ఛిద్రమై ప్రజలు ఇప్పటికీ ఆ బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. సత్యవేడు, నాగలాపురం, మండలాల్లో రహదారులను ఒకసారి చూస్తే అప్పట్లో జరిగిన అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు, ప్రకృతి విధ్వంసం కళ్ళకు కట్టినట్లు కనబడతాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ గ్రావెల్‌ తవ్వకాలు ఆగడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గంలో గ్రావెల్‌ మాఫియా కోరలు చాచింది. దీంతో సత్యవేడు, నాగలాపురం మండలాల్లో సుమారు 20 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పొంచిఉన్న ప్రమాదం

సత్యవేడు మండలంలోని జడేరి, ఏఎంపురం నాగలాపురం మండలంలోని గోళ్లవారికండ్రిగ తదితర గ్రామాల నుంచి నిత్యం వందకు పైగా టిప్పర్లు 50, 60 టన్నుల ఓవర్‌లోడ్‌తో ప్రయాణించడం వల్ల ఈ మార్గంలో రోడ్డు మొత్తం ధ్వంసమైంది. పరిశ్రమలకు వెళ్ళే కార్మికులు, పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు రోజూ నరకం అనుభవిస్తున్నారు. చిన్న పాటి సింగిల్‌ రోడ్డులో ఎదురుగా వచ్చే టిప్పర్ల బారినుంచి తప్పించుకోలేక గాయాలపాలవుతున్నారు. ఈ గ్రామాలనుంచి ఆస్పత్రికి అత్యవసరంగా వెళ్ళాలన్నా 108అంబులెన్స్‌ చేరుకోలేని పరిస్థితి నెలకొనివుంది. పలు గ్రామాల్లో భారీ వాహనాల తాకిడికి వాటర్‌ పైప్‌లైన్లు పగిలి నీరందక ప్రజలు అవస్థ పడుతున్నారు.ఏదైనా టిప్పర్‌ బ్రేక్‌డౌన్‌ అయి నిలిచిందంటే ఈ మార్గంలోని గ్రామాల ప్రజలు తమ ప్రయాణాలను వాయిదావేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది

108 వాహనం కూడా రావడం లేదు

గ్రావెల్‌ టిప్పర్ల రాకపోకలవల్ల రోడ్డు ధ్వంసమైపోయింది. ఎవరైనా గర్భిణులు కాన్పు కోసం ఆ్పత్రులకు తొందరగా వెళ్ళాలంటే టిప్పర్ల వల్ల 108 వాహనం కూడా సకాలంలో రావడం లేదు, ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలి

- పురుషోత్తం, కన్నావరం

రాత్రి వేళల్లో భయంగా ఉంది

టిప్పర్ల రాకపోకలతో రాత్రి వేళల్లో పనులు ముగించుకుని ఇంటికి రావాలంటే భయమేస్తోంది. టిప్పర్లు కనీసం రోడ్డు కూడా దిగడం లేదు. ఉన్నది చిన్న రోడ్డు. ఎక్కడ గుంత, ఎక్కడ పల్లం ఉందో తెలియదు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే అధికారులు, నాయకులు స్పందిస్తే బాగుంటుంది.

-గంగాధరం, ,కన్నావరం

Updated Date - Jan 28 , 2026 | 01:40 AM