వలంటరీ లైసెన్స్‌లపై మల్లగుల్లాలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:20 AM
దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరొందిన మదనపల్లె మార్కెట్‌లో సంక్షోభం నెలకొంది. ఇక్కడి మార్కెట్‌లో 102 మంది ట్రేడ్ లైసెన్సులు పొంది మండీలు నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా రైతులు తీసుకొచ్చిన టమోటను వ్యాపారులకు విక్రయించి మధ్యవర్తుల పాత్ర పోషిస్తున్నారు.
కమీషన్ లేకుంటే కష్టమంటున్న మండీ యజమానులు
లైసెన్సు రెన్యువల్‌కు రెండు రోజులే గడువు
మదనపల్లె టౌన్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరొందిన మదనపల్లె మార్కెట్‌లో సంక్షోభం నెలకొంది. ఇక్కడి మార్కెట్‌లో 102 మంది ట్రేడ్ లైసెన్సులు పొంది మండీలు నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా రైతులు తీసుకొచ్చిన టమోటను వ్యాపారులకు విక్రయించి మధ్యవర్తుల పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు 10శాతం కమీషన్ తీసుకునేవారు. 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రైతులు తీసుకొచ్చే టమోటాను మార్కెట్‌యార్డులో విక్రయిస్తే మండీ యజమానులు కమీషన్ తీసుకోకూడదని ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిపై మూడేళ్లపాటు మల్లగుల్లాలు పడ్డ మండీ యజమానులు, 2022లో హైకోర్టును ఆశ్రయించారు. తమకు ట్రేడ్ లైసెన్సు బదులు, కమీషన్ లైసెన్సులు మంజూరు చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ట్రేడ్ లైసెన్సుల జారీకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో గతనెల దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు మార్కెటింగ్ శాఖకు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. కమీషన్ బదులు వలంటరీ ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
వలంటరీ లైసెన్సులపై విముఖత
టమోటా రైతుల నుంచి 10శాతం కమీషన్ వసూలు చేసుకుంటేనే తమకు గిట్టుబాటు అవుతుందని, వలంటరీ లైసెన్సుతో ఒరిగేదేమీ లేదని మండీ యజమానులు వాపోతున్నారు. రైతులకు అండగా నారు నుంచి ఎరువులు, తదితర పెట్టుబడులు పెట్టే తమకు కమీషన్ తీసుకుంటేనే వ్యాపారం జరుగుతుందంటున్నారు. వలంటరీ ట్రేడ్ లైసెన్సు తీసుకుని టమోటాలు కొని, వ్యాపారులకు విక్రయిస్తే నష్టపోతున్నామని మండీ యజమానుల ప్రతినిధి ఎస్‌ఏ మస్తాన్ అంటున్నారు. దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. కాగా ప్రస్తుతం కోర్టును ఆశ్రయించిన 25 మంది మండీ యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరిలో 9 మంది వలంటరి ట్రేడ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారి నిర్ణయం రెండు రోజుల్లో తేలనుంది.
రెన్యువల్ చేసుకోకుంటే లైసెన్సుల రద్దు
జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో టమోట కొనుగోలు చేసే మండీ యజమానులు తప్పనిసరిగా వలంటరీ ట్రేడ్ లైసెన్సులు పొందాలి. ఈనెల 6వ తేదిన మండీ యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఈనెల 13వ లోపు వలంటరి ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేయించుకోవాలి. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేస్తాం.
- ఏడీఎం త్యాగరాజు