దుగరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుపై సర్కారు ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - May 14 , 2026 | 01:13 AM
ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దుగరాజపట్నం నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 1335.17 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి జిల్లా యంత్రాంగం ఆమోదముద్ర వేసింది.
పోర్టు పూర్తయితే పెట్టుబడులకు మరింత ఊతం
తిరుపతి(టీటీడీ), మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దుగరాజపట్నం నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 1335.17 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి జిల్లా యంత్రాంగం ఆమోదముద్ర వేసింది. భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్)కి అప్పగించనున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుఆదేశించారు. దీంతో భూసేకరణను పూర్తిచేసి ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
2047 నాటికి షిప్ బిల్డింగ్ చేసే దేశాల్లో తొలి ఐదు స్థానాల్లో మన దేశం వుండేలా కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒక భారీ నేషనల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు విశాఖపట్నం పోర్టు అథారిటీతో ఏపీ మారిటైమ్ బోర్డు గత ఏడాది సెప్టెంబరులో ఒప్పందం చేసుకుంది. దీనికి అనుగుణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలోని దుగరాజపట్నం వద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో పాటు షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఏపీ మారిటైమ్ బోర్డుకు అనుమతి ఇస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.తిరుపతి జిల్లా పరిధిలో 2039.98 ఎకరాలను, నెల్లూరు జిల్లాలో 176.39 ఎకరాలను సేకరించనున్నారు. ఇప్పటికే తిరుపతి జిల్లా పరిధిలో 1335.17 ఎకరాలకు జిల్లా యంత్రాంగం ప్రాథమిక నోటిఫికేషన్‌కు ఆమోదముద్ర వేసింది. త్వరలోనే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఎస్పీవీకి అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును సుమారు రూ.29,253 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. తద్వారా ఏడాదికి సుమారు 0.5 మిలియన్ గ్రాస్ టన్నుల సామర్థ్యంగల ఓడరేవు నిర్మించేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ డ్రై డాక్స్, షిప్ లిఫ్ట్‌లు, భారీ ఇంజనీరింగ్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే విదేశీ ఓడలపై ఆఽధారపడడం తగ్గుతుంది. స్వదేశీ ఓడల నిర్మాణ రంగాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. తద్వారా అదనంగా మరో రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల మేరకు పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటయ్యే ఆస్కారం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.