భూగర్భ జలాల పెంపుపై ప్రభుత్వం దృష్టి
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:30 AM
భూగర్భ జలాల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా జలధార-జలహారతి కార్యక్రమాన్ని శనివారం తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద నిర్వహించగా వీరిద్దరూ పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి రూరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా జలధార-జలహారతి కార్యక్రమాన్ని శనివారం తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద నిర్వహించగా వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. కలెక్టర్ గడ్డపారతో మట్టిని తవ్వగా, ఆ మట్టిన ఎమ్మెల్యే పార చేతపట్టి ఎత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలు, రైతులు నీటి వనరులకు ఇబ్బంది పడకూడదన్న ముందస్తు ఆలోచనలతో ప్రభుత్వం జలధార-జలహారతి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కి శ్రీకారం చుట్టిందని చెప్పారు. నీటి వనరులను సాగునీటి సంఘాల ద్వారా పటిష్ఠ పరచి భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపడున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి.. జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నామన్నారు. ఈ పనులతో నీటి నిల్వలు పెరిగి.. వ్యవసాయానికి, తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ఆర్డీవో రామ్మోహన్, జలవనరుల శాఖ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్, సాగునీటి సంఘ సభ్యులు, అధికారులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.