మామిడి ఎగుమతులకు ప్రభుత్వ సహకారం
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:23 AM
మామిడి ఉత్పత్తుల ఎగుమతికి ప్రభుత్వం తరపున సహకారం అందించడానికి కృషి చేస్తామని జిల్లా ఉద్యానశాఖాకారి దశరధరరామిరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరు మామిడి యార్డులో రైతులు, వ్యాపారులతో సోమవారం మారిటైం బోర్డు ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.
రైల్వేకోడూరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మామిడి ఉత్పత్తుల ఎగుమతికి ప్రభుత్వం తరపున సహకారం అందించడానికి కృషి చేస్తామని జిల్లా ఉద్యానశాఖాకారి దశరధరరామిరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరు మామిడి యార్డులో రైతులు, వ్యాపారులతో సోమవారం మారిటైం బోర్డు ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. మామిడి సాగు, సస్యరక్షణ, పంట కోతలు, ఎగుమతుల్లో ఇబ్బందులు, నష్టాల గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎగుమతి సమయంలో కాయలు దెబ్బతింటున్నాయా, అందుకు గల కారణాలు, విదేశాలకు ఎగుమతి చేయడానికి కావాల్సిన సదుపాయాలు, రవాణా తదితర అంశాల గురించి రైతులతో చర్చించారు. మారిటైం బోర్డు ప్రతినిధులు పవన్, శరత్ మాట్లాడుతూ మామిడి తోటల్లో మందుల పిచికారి నుంచి కాయలను కోసే వరకు ఖర్చులు, ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ‘రైల్వేకోడూరులో క్రిమిసంహార మందులు నాణ్యమైనవి లేవు. పైగా అధిక ధరలకు అమ్మతున్నారు. గుజ్జు పరిశ్రమలను కట్టడిచేసి గిట్టుబాటు ధర నిర్ణయించాలి. మామిడి యార్డులో వసతులు కల్పించాలి. కాయల కోతకు చిక్కాలు, ఆర్గానిక్ మందులు, టార్పాలిన్ పట్టలు పంపిణీ చేయాలి’ అని రైతులు కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్ పగడాల వరలక్ష్మి, రైల్వేకోడూరు ఉద్యానశాఖ అధికారి భాస్కర్, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.