Share News

ఏడాదిగా విడుదల కాని ప్రభుత్వ సబ్సిడీ

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:55 AM

స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన కార్యరూపం దాల్చడంలేదు. ఏడాదిగా లబ్ధిదారులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు, బీసీ కార్పొరేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించింది.

 ఏడాదిగా విడుదల కాని ప్రభుత్వ సబ్సిడీ
చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూల ప్రక్రియ

బీసీ రుణాలకు 5,457 మంది ఎంపిక

నిరాశ చెందుతున్న లబ్ధిదారులు

చిత్తూరు అర్బన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన కార్యరూపం దాల్చడంలేదు. ఏడాదిగా లబ్ధిదారులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు, బీసీ కార్పొరేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించింది. పేరుకు మాత్రమే బీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను ఏర్పాటు చేసి నెలనెలా జీతభత్యాలను ఇచ్చింది. బీసీ, ఉపకులాలను గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను ఆదుకోవాలని సంకల్పించింది. ఈక్రమంలోనే గత ఏడాది ఫిబ్రవరిలో రుణ దరఖాస్తులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 8,272 మంది దరఖాస్తు చేసుకున్నారు.

5,457 మంది ఎంపిక

వివిధ వడపోతల అనంతరం 5,457 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఇందులో స్వయం ఉపాధి కింద వివిధ యూనిట్ల కోసం కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన 2,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మేర రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు రుణంతో పాటు ప్రభుత్వం కొంత సబ్సిడీగా సమకూర్చాల్సి ఉంది. కొంత లబ్ధిదారులు భరించాలనేది నిబంధన. ఈమేరకు జిల్లాలో ఎంపిక చేసిన వారికి ప్రభుత్వం రూ.69.57 కోట్లను విడుదల చేయాల్సి ఉంటందని లెక్కలు తేల్చారు. జనరిక్‌ మెడికల్‌ షాపు పథకం కింద 21 యూనిట్ల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రూ.4 లక్షల సబ్సిడీ, రూ.4 లక్షలు బ్యాంకు రుణంగా సమకూర్చాల్సి ఉంది. ఫైనాన్షియల్‌ అసిస్టెంట్‌ స్కీం కింద కులవృత్తుల వారు 139 మంది దరఖాస్తు చేసుకున్నారు. 64 మందికి రుణాన్ని మంజూరు చేయగా రూ.1.92 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఎంఎ్‌సఎంఈ పథకం కింద బ్రిక్‌మేకింగ్‌, సిమెంట్‌ బ్రిక్స్‌ తయారీ కోసం నాలుగు యూనిట్లను కేటాయించింది. ఈ పథకం కింద యూనిట్‌ ధరను రూ.25 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో సబ్సిడీ కింద రూ.10 లక్షలు, బ్యాంకు రుణం రూ.10 లక్షలు, లబ్ధిదారుడు రూ.5 లక్షలు భరించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 2505 మందికి నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌పై శిక్షణ ఇచ్చారు. నిబంధనల మేరకు కుట్టు మిషన్‌ను అందించలేదు. మొత్తం మీద వివిధ యూనిట్ల ఏర్పాటుకు 5,457 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీరికి రూ.69.57 కోట్లమేర సబ్సిడీ విడుదల చేయాల్సి ఉంది.

లబ్ధిదారుల నిరాశ

లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోడానికి నానాయాతన పడ్డారు. కుల, ఆదాయ, నివేశ పత్రాల కోసం కొంత ఖర్చు పెట్టుకున్నాడు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి నెట్‌ సెంటర్లలో మరో రూ.200 వరకు ఇచ్చుకున్నారు. కార్యాలయాలకు, ఇంటర్వ్యూలకు వెళ్లడానికి మరికొంత వెచ్చించారు. ఇంటర్వ్యూలో ఎంపిక య్యాక ఎంతో సంతోషపడ్డారు, రుణమొచ్చిసినట్టేనని భావించారు. ఈ ప్రక్రియ జరిగి ఏడాది కావస్తున్నా రుణాలు మంజూరు కాలేదు. దీంతో జిల్లా కేంద్రానికి, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి గతేడాది మార్చికల్లా లబ్ధిదారుల ఖాతాల్లో రుణమొత్తం జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా యంత్రాంగం అందుకనుగుణంగా లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపి దాదాపు ఏడాదవుతోంది. సబ్సిడీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. సబ్సిడీ విడుదలైతే రుణసాయం అందిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రుణప్రక్రియలో ఎడతెగని జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

Updated Date - Mar 15 , 2026 | 01:55 AM