విద్యార్థులతో కళకళలాడుతున్న ప్రభుత్వ వసతి గృహాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:20 AM
వైసీపీ హయాంలో ప్రభుత్వ వసతి గృహాలను గాలికొదిలేసింది. పాలించిన ఐదేళ్లు వార్డెన్లకు జీతాలు తప్ప.. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చిల్లిగవ్వ విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు విడుదల చేసి 90 శాతం పనులను పూర్తిచేసింది. దాంతో ఈ ఏడాది సుమారు వెయ్యి మంది విద్యార్థులు అదనంగా వసతి గృహాల్లో చేరారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ వసతి గృహాలను గాలికొదిలేసింది. పాలించిన ఐదేళ్లు వార్డెన్లకు జీతాలు తప్ప.. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చిల్లిగవ్వ విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు విడుదల చేసి 90 శాతం పనులను పూర్తిచేసింది. దాంతో ఈ ఏడాది సుమారు వెయ్యి మంది విద్యార్థులు అదనంగా వసతి గృహాల్లో చేరారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
జిల్లాలో 57 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు పనిచేస్తున్నాయి. ఇందులో 16 పోస్టుమెట్రిక్ (కాలేజీ హాస్టళ్లు) కాగా... 46 ప్రీమెట్రిక్ (3 నుంచి 10వ తరగతి వరకు) వసతి గృహాలు నడుస్తున్నాయి. సాధారణంగా ఒక్కో వసతిగృహంలో వందమంది విద్యార్థులు ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019-24 మధ్యలో నవరత్నాల పేరుతో ఏ వర్గాన్ని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమశాఖనూ గాలికొదిలేసింది. ఆ ఐదేళ్లపాలనలో విద్యార్థుల బాగోగులు పట్టించుకోలేదు. విరిగిన కిటికీలు.. టాయిలెట్లకు లేని సింకులతో దర్శనమిచ్చేవి. కిటికీలకు దోమ తెరలు లేకపోవడంతో నిత్యం జ్వరాలతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయేవారు. మెనూ చార్జీలను పెంచమని వార్డెన్లు పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. అప్పటివరకు 3వేల మంది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య 2014-19 సంవత్సరాల్లో ఆ సంఖ్య 2వేలకు తగ్గిపోయింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వసతి గృహాలపై దృష్టి సారించింది. జిల్లాలోని 57 వసతి గృహాల్లో మౌలిక వసతులను కల్పించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నివేదికలు అందిన వెంటనే రూ.8.50 కోట్లను విడుదల చేశారు. సీఎం సొంత నియోజకవర్గానికి అదనంగా మరో రూ.3కోట్లను మంజూరు చేశారు. దాంతో ప్రభుత్వ వసతిగృహల్లో కిటికీలు, డోర్లు, టాయిలెట్లు, పైపులైన్లు, ప్రహరీలు బాగు చేయించి పెయింటింగ్స్ వేయించారు. విద్యార్థులకు ఉండటానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ఈ విషయంలో సాంఽఘిక సంక్షేమశాఖ అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపారు. దాంతో 2వేల మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 3,683కి పెరిగింది.
ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాం
విద్యార్థుల్లో క్రమశిక్షణ, విద్యపై ఆసక్తి పెరగాలంటే వసతి గృహాల్లో ఆహ్లాద వాతావరణం ఉండాలి. ప్రభుత్వం విడుదల చేసిన రూ.11.50కోట్ల నిధులతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాదికి మరింత మంది విద్యార్థులు వసతి గృహాల్లో చేరడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాం. పీఎం అజయ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలమనేరులో కాలేజ్ బాయ్స్, కాలేజ్ గర్ల్స్ వసతి గృహాలను మంజూరు చేసింది. ఒక్కో వసతి గృహానికి రూ.3కోట్లను విడుదల చేయగా.. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అక్కడే 3 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మరో ప్రీమెట్రిక్ హాస్టల్ మంజూరవగా స్థలాన్వేషణలో అధికారులు ఉన్నారు. స్థలాన్ని చూపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.
- విక్రమ్‌కుమార్‌రెడ్డి, డీడీ, సాంఘిక సంక్షేమశాఖ