టౌన్‌బ్యాంకు ఉద్యోగులపై పాలకమండలి పెత్తనం
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:39 AM
పీఆర్సీ (పే రివిజన్ కమిషన్)ని పోరాడి సాధించుకున్న తిరుపతి టౌన్‌బ్యాంకు ఉద్యోగులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ (పే రివిజన్ కమిషన్)ని పోరాడి సాధించుకున్న తిరుపతి టౌన్‌బ్యాంకు ఉద్యోగులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతృత్వంలోని పాలకమండలిని ఉద్యోగులు ప్రసన్నం చేసుకుంటే తప్ప పీఆర్సీ అమలు సాధ్యం కాలేదన్న ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం పీఆర్సీ అమలుకు మార్గం సుగమం చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దానిని అమలు చేయాల్సిన పాలక మండలి మాత్రం మోకాలడ్డుకున్నట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. చివరకు ఉద్యోగులే చందాలు వేసుకుని పాలక మండలి సభ్యులను ఒప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది.
ఏళ్ల తరబడి ఎదురుచూపులు
వందేళ్ల ఘన చరిత్ర కలిగిన తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఐదేళ్లుగా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.తాజాగా పీఆర్సీ వివాదం చర్చగా మారింది.టౌన్‌బ్యాంకులో పనిచేస్తున్న దాదాపు 95 మంది ఉద్యోగులు పీఆర్సీ కోసం చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. తమకు కూడా ఇతర బ్యాంకుల తరహాలో వేతన సవరణ అమలు చేయాలని పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్యలు చేపట్టి పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.అయితే పీఆర్సీ అమలుకు టౌన్‌బ్యాంకు పాలక మండలి నుంచి అవసరమైన తీర్మానం చేయడంలో జాప్యం చేశారు.ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన పాలక మండలి సభ్యులే కొర్రీలు వేశారు. అమలు చేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన పాలకమండలే అడ్డుకోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి దగ్గర తమ గోడు విన్నవించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పీఆర్సీ అమలుచేస్తామని భూమన చెప్పిన మాటలను గుర్తుచేశారు. దీంతో ఆయన అంగీకరించి ఉత్తర్వులను ఆమోదించాలని పాలకమండలికి ఆదేశాలిచ్చారు.
చందాలు వేసుకుని.. ప్రసన్నం చేసుకుని!
ఎవరు చెప్పినా పాలకమండలిలోని కొందరు సభ్యులు మాత్రం మొండికేసినట్టు తెలిసింది. దీంతో ఉద్యోగులు తమ వేతనాల నుంచి చందాలు వేసుకుని పాలక మండలి సభ్యులకు డబ్బులు సమర్పించాల్సి వచ్చిందనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక్కో సభ్యుడికి లక్ష చొప్పున సమర్పించినట్టు ప్రచారం జరుగుతోంది. చివరకు ఉద్యోగుల ఒత్తిడి, ప్రయత్నాల ఫలితంగా పీఆర్సీ అమలుకు అనుకూలంగా పాలక మండలి తీర్మానం చేసింది.
రాజకీయ కక్షతోనేనా?
కూటమి ప్రభుత్వం పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు తీసుకొచ్చిందన్న కారణంతో వైసీపీకి చెందిన పాలక మండలి సభ్యులు ఉద్యోగులను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర్వులను తీసుకురావడంలో కృషిచేసిన టీడీపీ నేతకు క్రెడిట్ వెళుతుందని ఆ పార్టీలో ఉండే కొందరు నేతలు ఉద్యోగులను ఇబ్బందిపెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన వేతన సవరణను రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సి ఉండగా.. ఇందులోనూ రాజకీయ కక్షలు, పట్టింపులు తెరపైకి రావడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వాటిని అమలు చేయాల్సిన సంస్థలోనే అవరోధాలు ఏర్పడితే ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పీఆర్సీ కోసం సంవత్సరాలుగా ఎదురుచూసిన ఉద్యోగులు.. ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా పాలక మండలి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.