టెన్త్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:06 AM
కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాలు తగ్గుముఖం పడుతున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి.. ఈసారి మంచి ఫలితాలను సాధించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వంద రోజుల ప్రణాళికపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాలు తగ్గుముఖం పడుతున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి.. ఈసారి మంచి ఫలితాలను సాధించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వంద రోజుల ప్రణాళికపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పాఠ్యాంశాల సామగ్రి, బోధన విధానాలు ఒకేలా ఉన్నప్పటికీ పరీక్షా ఫలితాల్లో తేడాలు కనిపిస్తే దానికి ఆ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులదే బాధ్యత అన్నారు. పనితీరు మెరుగుపడని హెచ్‌ఎంలను అవసరమైతే బదిలీ చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. పాఠశాలల్లో క్రమశిక్షణ అత్యంత కీలకమని, క్రమశిక్షణ లోపిస్తే మొత్తం విద్యా వ్యవస్థ వైఫల్యంగా మారుతోందన్నారు. పాఠశాలల పనితీరు అధ్వాన్నంగా ఉన్న 25-30 శాతం పాఠశాలలను గుర్తించామని, అక్కడ నిరంతర పర్యవేక్షణ చేపడతామన్నారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతారాహిత్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల అధిక గైర్హాజరు ఉన్నపాఠశాలలపై ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తామన్నారు. అద్భుత ఫలితాలను ఆశించడం లేదని, ఇక నుంచి కనీసం ఐదు నుంచి పదిశాతం మెరుగుదల ప్రతి పాఠశాలలో కనిపించాలన్నారు. పాఠశాలల్లో రాజకీయ పంచాయితీలు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఎంఈవోలు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య విషయాలు, వివిఽధ సబ్జెక్టుల్లో వెనుకబడ్డ సీ, డీ గ్రేడులోని విద్యార్థులు పురోగతి దిశలో వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్ నిర్మాణం కోసం రూ.10లక్షలు మంజూరు చేస్తానని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తవణంపల్లె, వి.కోట, బంగారుపాళ్యం, నగరి, ఎస్‌ఆర్‌పురం, జీడీ నెల్లూరు, రామకుప్పం, చిత్తూరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎంఈవోల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈవో రాజేంద్రప్రసాద్, ఎస్‌ఎ్‌సఏ పీడీ వెంకటరమణ, ఎంఈవోలు పాల్గొన్నారు.