Share News

టిడ్కో బాధితులకు శుభవార్త

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:57 AM

టిడ్కో పథకంలో ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుని మోసపోయిన బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణం కోసం తమవంతు వాటాగా చెల్లించిన సొమ్మును లబ్ధిదారులకు తిరిగి చెల్లించేందుకు నిధులు విడుదల చేసింది.

టిడ్కో బాధితులకు శుభవార్త

డిపాజిట్‌ సొమ్ము చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

1,709 మందికి రూ.3.09 కోట్లు వెనక్కి

టిడ్కో పథకంలో ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుని మోసపోయిన బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణం కోసం తమవంతు వాటాగా చెల్లించిన సొమ్మును లబ్ధిదారులకు తిరిగి చెల్లించేందుకు నిధులు విడుదల చేసింది.

మదనపల్లె, జూలై 3(ఆంధ్రజ్యోతి): సొంతింటి కల సాకారానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. మూడు విభాగాలలో బహుళ అంతస్థులు నిర్మించాలని తలచింది. ఒక విభాగాన్ని పూర్తి చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన రెండు విభాగాలను రద్దు చేసింది. అయితే ఇందుకోసం లబ్ధిదారుడు తన వాటా కింద చెల్లించిన డిపాజిట్‌ సొమ్ము ఇవ్వకుండా ఆపేసింది. ఆ నిధులను కూడా ఇతర పథకాలకు వాడేసుకుంది. అటు ఇల్లు, ఇటు సొమ్ము రాకపోవడంతో బాధితులు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారిపట్ల కరుణ చూపింది. వారు చెల్లించిన రూ.12,500, రూ.25,000 సొమ్ము వెనక్కి ఇచ్చేలా నిధులు మంజూరు చేసింది. ఇలా మదనపల్లె మున్సిపాలిటీలో 1,709 మందికి సంబంధించిన రూ.3.09 కోట్లు చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల వివరాలు తీసుకుని వారి బ్యాంకు ఖాతాకు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

లబ్ధిదారుల వివరాల సేకరణలో అధికారులు

మదనపల్లె మున్సిపాలిటీలో పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి అప్పటి ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) బహుళ అంతస్థుల పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారి పక్కన శానిటోరియం సమీపంలోని వెంకప్పకోట రెవెన్యూ గ్రామంలోని 36ఎకరాల్లో మూడు విభాగాల్లో నిర్మాణం మొదలు పెట్టారు. జీప్లస్‌-3 నమూనాలో అపార్ట్‌మెంట్స్‌ నిర్మించి ఆన్‌లైన్‌ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. అర్హులైన లబ్ధిదారులకు 3,773 ఫ్లాట్లు కేటాయించగా అందులో 3,560కి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అప్పట్లో మున్సిపల్‌ కమిషనర్‌ పేరున కేటగిరి-1లో 300 చ.అ. విస్తీర్ణానికి లబ్దిదారుడి వాటాగా ఒకేసారి రూ.500, కేటగిరి-2లోని 365చ.అ. విస్తీర్ణానికి రూ.12,500, కేటగిరి-3లోని 430చ.అ. విస్తీర్ణానికి రూ.25,000 డీడీలు చెల్లించారు. మొదటి కేటగిరి నిర్మాణానికి ఒకేసారి రూ.500 చెల్లించగా, రెండో కేటగిరి లబ్ధిదారుడు రూ.50వేలను రూ.12,500 చొప్పున నాలుగు విడతల్లో, మూడో కేటగిరికి చెల్లించాల్సిన లక్ష రూపాయలను రూ.25,000 చొప్పున నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంది. పథకం ప్రారంభంలో లబ్ధిదారులు మొదటి విడతగా చెల్లించాల్సిన రూ.500, రూ.12,500, రూ.25,000లను చెల్లించారు. వీరిలో రెండో కేటగిరిలో 957 మంది రూ.12,500 చొప్పున రూ.1.20 కోట్లు, మూడో కేటగిరిలో 752 మంది రూ.25,000 చొప్పున రూ.1.90 కోట్లు చెల్లించారు. మొదటి కేటగిరిలో 1,872 మంది రూ.500 చొప్పున చెల్లించగా నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన కేటగిరి-2, కేటగిరి-3లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు ఇతర పథకాలకు వెళ్లిపోయారు. చెల్లించిన సొమ్ముకోసం ఆరేళ్లుగా నిరీక్షిస్తుండగా తాజాగా కూటమి ప్రభుత్వం వెనక్కి ఇవ్వడానికి ముందుకొచ్చింది. 1,709 మందికి రూ.3.09కోట్లు చెల్లించడానికి ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా గతంలో లబ్ధిదారుడు తీసిన డీడీని, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకం వివరాలను సేకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:57 AM