సంక్షేమం, అభివృద్ధి సమాహారమే స్వర్ణ చిత్తూరు
ABN , Publish Date - Aug 16 , 2026 | 02:10 AM
స్వాతంత్య్ర స్ఫూర్తితో అభివృద్ధి.. సంక్షేమం సమాహారంగా స్వర్ణ చిత్తూరు సాకారమవుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి.. కూటమి ప్రభుత్వం జిల్లాలో చేసిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి వివరించారు.
80వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి సత్యకుమార్
చిత్తూరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర స్ఫూర్తితో అభివృద్ధి.. సంక్షేమం సమాహారంగా స్వర్ణ చిత్తూరు సాకారమవుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి.. కూటమి ప్రభుత్వం జిల్లాలో చేసిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఆయన మాటల్లోనే..
- తల్లికి వందనం కింద 1,97,280 మంది తల్లుల ఖాతాల్లో రూ.295.92 కోట్లను జమ చేశాం. అన్నదాత సుఖీభవ పథకంలో 1,78,622 మంది రైతులకు రూ.85.62 కోట్లు.. పీఎం కిసాన్ ద్వారా 1,42,109 మంది రైతులకు రూ.28.42 కోట్లు అందించాం. ఎన్టీఆర్ భరోసా కింద ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,31,815 మందికి రూ.487.65 కోట్లను అందించాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో మహిళలకు రూ.138.37 కోట్ల లబ్ధి కలిగింది. దీపం2.0 కింద 354,078 మంది లబ్ధిదారులకు రూ.138.76 కోట్ల విలువైన సిలిండర్లు ఉచితంగా అందించాం. ఉపాధిహామీ పథకం ద్వారా పాడిరైతులకు 70-90 శాతం సబ్సిడీతో 2,941 గోకులం షెడ్లను నిర్మించాం. మామిడి రైతులకు రెండేళ్లపాటు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అందించాం.
- 168 మంది టెన్త్, 84 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభించిన చిత్తూరులోని కేంద్రియ విద్యాలయానికి 8.. కుప్పంలో కేవీకి 10 ఎకరాల చొప్పున స్థలాన్ని కేటాయించాం. 42 సాంఘిక సంక్షేమ వసతిగృహాలను రూ.8 కోట్లతో మరమ్మతులు చేపట్టాం.
- కైగల్ ప్రాంతాన్ని 20 ఎకరాల్లో ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేయనున్నాం.
- కుప్పం, తవణంపల్లె, కార్వేటినగరం మండలాల్లో కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా 2.30 లక్షల మందికి డిజిటల్ వైద్య సేవలు అందించాం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా రూ.43.60 కోట్లతో 21,977 మందికి చికిత్స అందించాం.
- కుప్పం నియోజకవర్గాన్ని కాలుష్యరహితంగా చేయాలనే లక్ష్యంతో 5,555 ఈసైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాం. 61 ఏళ్ల నాటి కంగుందిలోని భూసమస్యకు పరిష్కారం చూపి, 460 ఎకరాల డీకేటీ పట్టాలు పంపిణీ చేశాం. రూ.9300 కోట్లతో ఏర్పాటుకానున్న 30 భారీ పరిశ్రమలతో సుమారు 40 వేల మందికి ఉపాధి దక్కనుంది.
- రూ.3210 కోట్లతో 116 కి.మీల చిత్తూరు- తచ్చూరు హైవేను ప్రారంభించాం.
- జిల్లా వృద్ధి రేటు 15 శాతం సాధించడం, పీ4 బంగారు కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన, పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దాం.