Share News

బినామీ పేర్లతో బంగారం రుణాలు?

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:49 AM

నిమ్మనపల్లె ప్రాథమిక వ్యసాయ పరపతి సంఘం (సింగిల్‌ విండో)లో జరిగిన బంగారు సొమ్ముల స్వాహాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బినామీ పేర్లతో సీఈవో బంగారు రుణాలను పొందినట్లు తెలుస్తోంది. గిల్టు నగలు మార్చడం.. రైతులకు తెలియకుండానే వారి నగలనూ రిలీజ్‌ చేసుకుని (డబ్బు కట్టకుండానే) వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.

బినామీ పేర్లతో బంగారం రుణాలు?
నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం

గిల్టు నగలతో మాయాజాలం

సస్పెన్షన్‌ అవుతామని ఊహించే ఖాతాల క్లోజ్‌

రైతుల నగలూ విడిపించుకెళ్లిన వైనం

నిమ్మనపల్లె ‘విండో’లో వెలుగు చూస్తున్న ఘటనలెన్నో?

నిమ్మనపల్లె ప్రాథమిక వ్యసాయ పరపతి సంఘం (సింగిల్‌ విండో)లో జరిగిన బంగారు సొమ్ముల స్వాహాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బినామీ పేర్లతో సీఈవో బంగారు రుణాలను పొందినట్లు తెలుస్తోంది. గిల్టు నగలు మార్చడం.. రైతులకు తెలియకుండానే వారి నగలనూ రిలీజ్‌ చేసుకుని (డబ్బు కట్టకుండానే) వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.

- మదనపల్లె, ఆంధ్రజ్యోతి

నిమ్మనపల్లె సహకార సొసైటీలో బంగారంపై 120 ఖాతాలకు రూ.2.50 కోట్లు, పంట రుణాలు రూ.3 కోట్ల వరకు ఇచ్చినట్లు అంచనా. ఇందులో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో 101 బంగారు రుణాల ఖాతాలు క్లోజ్‌ అయి రూ.రెండు కోట్లు చెల్లించినట్లు రికార్డుల్లో చూపారు. ఆ మొత్తాన్ని సీఈవో..బ్యాంకు ఖాతాకు జమ చేయలేరు. ‘డ్యూ టూ అకౌంట్‌ హరినాథ్‌రెడ్డి’ పేరున రికార్డులో నమోదు చేశారు. అంటే.. బ్యాంకుకు ఈ మొత్తం సీఈవో అప్పు ఉన్నట్లు అన్నమాట. ఇక్కడే మరికొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బంగారు రుణాలన్నీ నిజంగా రైతులే తీసుకుని ఉంటే.. రెండు రోజుల్లోనే 101 ఖాతాలను విడిపించుకోవడం అనేది అసాధ్యం. ఒక్కటి కూడా రెన్యువల్‌ లేకుండా, తక్కువ వ్యవధిలో ఇంతపెద్ద స్థాయిలో క్లోజ్‌ చేసినట్లు చూపడం వెనుక ఏం జరిగిందనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీస్తే వీటిలో కొన్ని బినామీల పేరిట రుణాలు ఉండొచ్చని తేలింది. తనకు తెలిసిన, బంధువులు, స్నేహితులు.. వీరి పేర్లతో ఖాతాలు తెరిచి విడతల వారీగా పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బంగారం రొటేషన్‌ చేశారా?

బినామీ పేర్లతో రుణాలు తీసుకోవడానికి అంత బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందనేది మరో ప్రశ్న. ఇక్కడే చేతివాటం చూసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు ఒక రైతు బంగారం పెట్టి రుణం తీసుకున్నాడనుకుందాం. స్ట్రాంగ్‌ రూమ్‌లోని ఆ బంగారం స్థానంలో నకిలీది పెట్టి.. దాన్ని బయటకు తెచ్చి బినామీ పేర్లతో రుణం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అందుకనే పది ఖాతాలకు సంబంధించి నకిలీ బంగారం ఉన్నట్లు చెబుతారు. తాను నిజమైన బంగారం పెడితే, నకిలీ బంగారం ఉన్నట్లు రావడం ఏంటని బాధితుడు ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. రీ-అప్రైజింగ్‌ అయ్యాక అసలు బంగారాన్ని తీసి.. వాటి స్థానంలో నకిలీ బంగారాన్ని పెట్టడం, రీ-అప్రైజింగ్‌ సమయానికి మరోచోట నుంచి బ్యాగులు తెచ్చి పెట్టడం తరచూ జరుగుతున్న ప్రక్రియగా విమర్శలున్నాయి. సొసైటీలో బంగారంపై రుణం తీసుకోవాలంటే అప్లికేషన్‌, లోను లెగ్జర్‌లో కచ్చితంగా అప్రైజర్‌ సంతకం ఉండాలి. ఇది నిబంధన. దీని ప్రకారం జరిగుంటే అప్రైజర్‌, వీటిని ఎంట్రీ చేసిన మరో ఉద్యోగి పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సస్పెండవుతామనే క్లోజ్‌ చేశారా?

గతేడాది నవంబరు 26వ తేదీని సొసైటీలో బంగారంపై రీ-అప్రైజింగ్‌ చేశారు. పది ఖాతాలకు సంబంధించి నకిలీ బంగారంపై రూ.28.96 లక్షల రుణం ఇచ్చినట్లు తేలింది. బయటకు వచ్చిన మరుసటి రోజే ఈ మొత్తాన్ని కట్టించేశారు. విచారణ మొదలైంది. ఈ క్రమంలో నకిలీ బంగారం కేసులో తాను సస్పెండు కావడం ఖాయమని సీఈవో భావించినట్లు చెబుతున్నారు. తాను సస్పెండయ్యాక బాధ్యతలు మరొకరికి అప్పగించాలి. ఇక్కడ జరిగిన లావాదేవీల రికార్డులు, తాకట్టు పెట్టిన బంగారాన్నీ చూపించాలి. దీంతో బినామీల గుట్టు బయటకు వచ్చి.. వారికీ నోటీసులు వెళతాయని, వాళ్ల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను ముందుగా అంచనావేసి ఆందోళన చెందినట్లు సమాచారం. అందుకనే ఫిబ్రవరి 2, 3 తేదీల్లో రుణగ్రహీతలతో సంబంధం లేకుండా అతడే రూ.రెండు కోట్లకు సంబంధించి 101 ఖాతాలనూ క్లోజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇతడి బినామీ రుణాల క్లోజింగ్‌ నగదు రూపంలో జరగలేదని అర్థమవుతోంది.

ఆ ఖాతాలన్నీ బినామీలవే కావా!

రెండు రోజుల్లోనే క్లోజ్‌ చేసినట్లు చూపుతున్న 101 ఖాతాలూ బినామీలే కావని, కొన్ని రైతులవీ ఉన్నట్లు తెలుస్తోంది. తన సస్పెన్షన్‌ను ఊహించి.. గతేడాది డిసెంబరు, జనవరిల్లో బంగారం తాకట్టు పెట్టిన కొందరు రైతులు, కస్టమర్లను సీఈవో పిలిపించి విడతలవారీగా వారి ఖాతాలను క్లోజ్‌ చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నగదును రికార్డుల్లో చూపకుండా ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఒకేసారి లెక్కల్లోకి తెచ్చి, వాటినీ క్లోజింగ్‌లో చూపినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఫ తాను తాకట్టు పెట్టిన బంగారాన్ని రిలీజ్‌ చేసుకోవడానికి ఓ కస్టమర్‌ సొసైటీకి వెళ్తే, మీపేరున రుణం లేదని చెప్పి పంపినట్లు విశ్వనీయ సమాచారం. దీనిపై బాధితుడు.. నిందితులను ప్రశ్నిస్తే, కొంత సమయమిస్తే రిలీజ్‌ చేసిస్తామని సర్దుబాటు చేసి పంపినట్లు తెలిసింది. సొసైటీలో పెట్టిన బంగారాన్ని బయటకు తెచ్చి ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఆ రెండు రోజుల్లో క్లోజ్‌ చేసిన 101 ఖాతాల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో? అవీ.. ఇవీ కలిపి తాను బ్యాంకుకు రూ.రెండు కోట్ల అప్పు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసి వెళ్లిపోయారు.

సీఈవోతోపాటు సహచరుడిపైనా అనుమానం

భారీస్థాయిలో స్కామ్‌ చేయడం ఒకరి వల్ల కాదని, మరికొందరి ప్రమేయాన్ని అధికారులు బలంగా నమ్ముతున్నారు. అప్రైజరు, సీఈవోకు అనుచరుడిగా ఉంటున్న మరో ఉద్యోగిని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ రికార్డుల్లో నమోదు చేస్తున్నదీ అనుచర ఉద్యోగే. ఇప్పటికే రైతులు, కస్లమర్లకు ఇచ్చిన రుణాల రికార్డులు, అప్లికేషన్లు, లెగ్జర్‌ పుస్తకాలు, లాకర్‌ గదిని డీసీసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. సహకారశాఖ నుంచీ ‘51 ఎంక్వయిరీ’ మొదలు పెట్టనున్నారు.

మిగిలిందిక 9 బంగారు ఖాతాలే!

నకిలీ బంగారంపై రుణాలు.. 101 ఖాతాలు క్లోజ్‌ తర్వాత నిమ్మనపల్లె సొసైటీలో మిగిలి బంగారు రుణ ఖాతాలు తొమ్మిది ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ.23.50 లక్షలేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పోలీసులు కేసు నమోదు చేసేదెప్పుడో?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా సొసైటీలో రూ.2కోట్లకుపైగా నిధులు స్వాహా చేయడం ఇదే ప్రథమం. దీనిపై నివేదిక రూపొందించారు. బాధ్యుడైన సీఈవో హరినాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సొసైటీ త్రీమెన్‌ కమిటీ నాన్‌అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి వెంకటరమణ నిమ్మనపల్లె పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆదివారం నాటికి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

Updated Date - Mar 09 , 2026 | 01:49 AM