Share News

చికిత్స కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:57 AM

ముంబయి - చెన్నై జాతీయ రహదారిలో కారును లగేజీ వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లగేజీ వాహనం డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది.

చికిత్స కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
నుజ్జునుజ్జయిన కారు

- కారును ఢీకొన్న లగేజీ వాహనం

- ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

- మృతుల్లో తల్లీకూతుళ్లు

ములకలచెరువు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ముంబయి - చెన్నై జాతీయ రహదారిలో కారును లగేజీ వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లగేజీ వాహనం డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల మేరకు... అనంతపురానికి చెందిన షేక్‌ ఖాదర్‌వలి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణానికి చెందిన ఆదిలక్ష్మి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం కుటుంబీకులు మురళి, వనజాక్షి గురువారం రాత్రి కారు బాడుగకు మాట్లాడుకుని పలమనేరు దగ్గరున్న విరూపాక్షపురం బయలుదేరారు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ముంబయి - చెన్నై జాతీయ రహదారిలోని ములకలచెరువు మండలం కదిరినాదునికోట పంచాయతీ గొడ్డావులకోట సమీపంలో ఎదురుగా మదనపల్లె నుంచి శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు ఖాళీ టమోటా క్రేట్లు తీసుకెళ్తున్న లగేజి వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్‌ షేక్‌ ఖాదర్‌వలి(45) అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రతాప్‌ సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఆదిలక్ష్మి, మురళి, వనజాక్షిలను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మి(86) మార్గం మధ్యలో మృతి చెందింది. వైద్యుల సూచన మేరకు మురళి, వనజాక్షిలను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వనజాక్షి(46) మృతిచెందింది. లగేజీ వాహనం నడుపుతున్న శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన బాలాజీ నాయక్‌ తీవ్రంగా గాయపడి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లగేజీ వాహనంలోని మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలకు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతపురానికి తరలించారు. మృతిచెందిన వారిలో ఆదిలక్ష్మి, వనజాక్షి తల్లీకూతుళ్లు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌ తెలిపారు.

ట్రాఫిక్‌కు అంతరాయం

లగేజీ వాహనం ఢీకొనడంతో కారు జాతీయ రహదారిపై బోల్తాపడింది. అలాగే లగేజీ వాహనం రోడ్డుపక్కన పడిపోయింది. దీంతో కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఎస్‌ఐ ప్రతాప్‌ రోడ్డుపై బోల్తాపడ్డ కారును ఎక్స్‌కవేటర్‌ సహాయంతో పక్కకు తీయించారు.

Updated Date - Mar 14 , 2026 | 12:58 AM