రాయంచపై వాగ్దేవి అభయం
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:08 AM
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నశేష, హంసవాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు.
తిరుమల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నశేష, హంసవాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామిని రాత్రి విశేష సమర్పణతో సిద్ధం చేసి ఆలయం ముందున్న వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన హంసవాహనంపై కొలువుదీర్చి సరస్వతీదేవి అలంకారం చేశారు. సరిగ్గా 7 గంటల సమయానికి వాహనమండపం తెరతీయగానే భక్తుల గోవిందనామస్మరణలతో మాడవీధులు మారుమోగాయి. అనంతరం ఉత్సవమూర్తికి హారతి, శఠారీ సమర్పించి వాహనసేవను ప్రారంభించారు. చల్లటి వాతావరణంలో గోవింద నామస్మరణలు, కర్పూర హారతులు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ మలయప్పస్వామి సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై ఊరేగారు. జీయర్ స్వాములు నాలాయిర దివ్యప్రబంధాన్ని గానం చేస్తూ ముందుకు సాగగా, వందలాదిమంది వైష్ణవులు అనుసరించారు.9 గంటలకు వాహనసేవను ముగించి పుష్కరిణి హారతి, కుంభ హారతి సమర్పించి తిరిగి వాహనమండపానికి తీసుకొచ్చారు.రెండుగంటల పన్నెండు నిమిషాల పాటు వాహనసేవ సాగింది.ఉదయం ఐదు తలల చిన్నశేషవాహనంపై ద్వారక కృష్ణుడి రూపంలో మలయప్పస్వామి దర్శనభాగ్యాన్నిచ్చారు.హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.