మద్యం మానేందుకని వెళ్లి..!
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:53 AM
మద్యం అలవాటు ఎంత నష్టమో తెలుసుకున్నాడు. మానేసేందుకు ‘కంకణం’ కట్టుకోవాలనుకున్నాడు. దీనికోసం స్నేహితులతో కలిసి వెళుతూ.. చివరగా ఓ సారి తాగదామనుకున్నాడు. ఈ ఆలోచనే అతడిని మృత్యువువైపు నడిపించింది.
చివరగా ఓసారని స్నేహితులతో కలిసి తాగిన యువకుడు
ఆపై కల్యాణి డ్యామ్‌లో ఈతకెళ్లి మునిగిపోయిన మురళీమోహన్
మూడురోజుల తర్వాత బయటపడిన మృతదేహం
మద్యం అలవాటు ఎంత నష్టమో తెలుసుకున్నాడు. మానేసేందుకు ‘కంకణం’ కట్టుకోవాలనుకున్నాడు. దీనికోసం స్నేహితులతో కలిసి వెళుతూ.. చివరగా ఓ సారి తాగదామనుకున్నాడు. ఈ ఆలోచనే అతడిని మృత్యువువైపు నడిపించింది. మద్యం మత్తులో ఈతకొట్టేందుకు కల్యాణి డ్యామ్‌లో దూకిన యువకుడి జీవితం విషాదాంతమైంది. అతడిపై ఆధారపడిన కుటుంబాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది.
పుంగనూరు/చంద్రగిరి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం కల్యాణి డ్యామ్‌లో శనివారం మునిగిపోయిన యువకుడు.. మంగళవారం శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కుమ్మరనత్తం గ్రామం చిన్నమిట్టపల్లెకు చెందిన మురళీమోహన్ (36).. భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి జీవిస్తున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యారు. దీంతో ఇబ్బందులు తలెత్తడంతో తాగుడు అలవాటు మానేయాలని భావించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మూలస్థాన ఎల్లమ్మ గుడిలో కంకణం(చేతికి దారం) కట్టుకుంటే మద్యం తాగరని తెలిసింది. కంకణం కట్టుకోవడానికి శనివారం (18వ తేది) పుంగనూరు నుంచి స్నేహితులు గంగరాజు, సుబ్రహ్మణ్యంతో కలిసి కారులో మురళీమోహన్ బయలుదేరారు. ఎలాగూ మద్యం ఆపేస్తున్నానని.. చివరగా ఓసారి మద్యం తాగి వెళదామని అన్నారు. అలా స్నేహితులతో కలిసి మద్యం తాగారు. కల్యాణిడ్యామ్‌లో ఈత కొట్టి తర్వాత గుడికి వెళ్దామనుకున్నారు. డ్యామ్‌లో గేట్ల వద్ద నుంచి దూకి ఈతకొట్టారు. మద్యం మత్తులో మురళీమోహన్ మాత్రం నీటిలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు అతడి కోసం చాలా సేపు వెదికినా ఫలితం లేకపోయింది. రాత్రి గ్రామానికి వచ్చి మిగతా స్నేహితులకు విషయం చెప్పారు. ఈ విషయం బాధితుడి కుటుంబీకులకు తెలిసింది. దీంతో వారు ఆదివారం పుంగనూరు సీఐ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగింది చంద్రగిరి మండలంలో కావడంతో, అక్కడే ఫిర్యాదు ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు దీనిపై చంద్రగిరి పోలీసులకు సీఐ సమాచారమిచ్చారు. చంద్రగిరి పోలీసులు రెస్క్యూటీమ్ ద్వారా మురళీమోహన్ కోసం ఆది, సోమవారాల్లో కల్యాణి డ్యామ్‌లో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మురళీమోహన్ మృతదేహం డ్యామ్‌లో నీటిపై తేలుతుండగా, చేపలు పట్టేవాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టని విధంగా మారిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం చిన్నమిట్టపల్లెలో మురళీమోహన్ అంత్యక్రియలు నిర్వహించారు. మద్యం మానేద్దామని వెళ్లి కుటుంబ యజమాని మృతి చెందడంతో భార్య, కుమారుడు, కుమార్తె అనాఽథలయ్యారు.