Share News

మామిడితోపులోని స్థావరంలో లింగ నిర్ధారణ పరీక్షలు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:05 AM

మామిడితోపులోని ఓ ఇంట్లో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

  మామిడితోపులోని స్థావరంలో లింగ నిర్ధారణ పరీక్షలు
స్కానింగ్‌ పరికరాలను పరిశీలిస్తున్న పోలీసులు

బంగారుపాళ్యం, మే 31 (ఆంధ్రజ్యోతి): మామిడితోపులోని ఓ ఇంట్లో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పరీక్షలు చేస్తున్న ఈ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ వివరాలను ఆదివారం సీఐ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. బంగారపాళ్యం మండలంలోని రాగిమానుపెంట పంచాయతీ బీఎల్‌ కండ్రిగ, చంద్రశేఖరపురం సమీపంలో రోమన్‌కుమార్‌కు చెందిన మామిడి తోపులో ఓ ఇల్లు ఉంది. అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పోలీసులకు శనివారం సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు తమ సిబ్బందితో అక్కడుకు చేరుకొని దాడులు నిర్వహించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి భార్య పద్మావతి, ఎస్టేట్‌లోని పోలీసు కాలనీకి చెందిన జ్యోతి, బంగారుపాళ్యం మండలం కేజీ సత్రంకు చెందిన ఆటో డ్రైవర్‌ జ్యోతీష్‌ పట్టుబడ్డారు వీరి నుంచి స్కానింగ్‌ చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు జిల్లాకు చెందిన 14 మంది గర్భిణులు ఉన్నారు. వీరిని వాహనాల ద్వారా బంగారుపాళ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా తమను ఈ ముఠాలోని నాగరాజు అనే వ్యక్తి ఫోన్‌లో నమ్మబలికి ఇక్కడకు తీసుకొచ్చారని.. లింగ నిర్ధారణకు రూ.10 వేలు ముందుగానే ఇస్తేనే పరీక్షలు చేస్తారని బాధితులు పోలీసులకు తెలిపారు. మిట్టూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి, కేజీ సత్రంకు చెందిన నాగరాజు పోలీసులను చూసి పరారయ్యారు. సుఽధాకర్‌రెడ్డి భార్య పద్మావతి, జ్యోతి గర్భిణులకు స్కానింగ్‌ చేసేవారు. జ్యోతీష్‌, పద్మావతి, జ్యోతి, రోమన్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్‌ఐ ప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు రెడ్డెప్ప, సామ్రాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:05 AM