Share News

స్థానిక సమరానికి సన్నద్ధం

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:21 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లిన బ్యాలెట్‌ బాక్సులు 13వ తేదీన తిరుపతికి రానున్నాయి. వీటిని నగరంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ఉన్న గోదాములో భద్రపరచనున్నారు.

స్థానిక సమరానికి సన్నద్ధం
బ్యాలెట్‌ బాక్సులు

- 790 పంచాయతీల్లో ఓటర్లు 12,68,039

- గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే ఆ 63 మాటేంటి?

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లిన బ్యాలెట్‌ బాక్సులు 13వ తేదీన తిరుపతికి రానున్నాయి. వీటిని నగరంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ఉన్న గోదాములో భద్రపరచనున్నారు.

కోర్టు కేసుల్లో 17 పంచాయతీలు

జిల్లాలో మొత్తం 807 గ్రామపంచాయతీలున్నాయి. 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం పంచాయతీల పునరుద్ధరణ పేరుతో ఇష్టానుసారంగా కొన్నింటిని విభజించి, మరికొన్నింటిని విలీనం చేసింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 17 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. అందువల్ల 790 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగిసింది.దాంతో 790 పంచాయతీల్లోని 7,370వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను ప్రచురించారు.12,68,039మంది ఓటర్లలో పురుషులు 6,17,069 మంది, మహిళలు 6,50,878 మంది, ఇతరులు 92మంది ఉన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, మౌలిక వసతులపై జిల్లా అధికారులకు సమాచారం ఇస్తున్నారు.

మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి

జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని పాలకవర్గాలు దిగిపోయాయి. వచ్చే నెల 24వ తేదీతో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలమూ ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి సమగ్ర సమాచారంతో వార్డులవారీగా ఇప్పటికే అధికారులు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పూర్తయ్యాక జిల్లాలో 2,221 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆ పంచాయతీల్లో ప్రశ్నార్థకం

సీఎం చంద్రబాబు సూచనతో తిరుపతి నగరాన్ని విస్తృతం చేయడానికి గ్రేటర్‌ ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తిరుపతి నగరపాలక సంస్థలోకి నాలుగు మండలాల్లోని కొన్ని పంచాయతీలను విలీనం చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, అప్పటి పాలకవర్గం కూడా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అదే సమయానికి జనగణన కార్యక్రమం రావడంతో గ్రేటర్‌ ప్రతిపాదన తాత్కాలికంగా వాయిదా పడింది. గ్రేటర్‌ తిరుపతి ఆవిర్భవిస్తే మాత్రం కలెక్టర్‌ నివేదిక మేరకు తిరుపతి రూరల్‌, రేణిగుంట, ఏర్పేడు, ఆర్సీపురం, చంద్రగిరి మండలాల్లోని 63 పంచాయతీలు విలీనం కానున్నాయి. ఇదే జరిగితే ఈ పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సిద్ధంగా ఉన్నాం

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే పంచాయతీల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. ఎన్నికల సామగ్రికి సంబంధించిన అంచనా, వివరాలు తయారుచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపాం. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి డివిజన్ల పరిధిలో మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాలతో ఏప్రిల్‌లోనే 790పంచాయతీల్లో ఓటర్ల జాబితా కూడా ప్రచురించాం. కోర్టు కేసులున్న 17 పంచాయతీల్లోని సమస్యలను ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరించి.. ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేస్తాం.

- డీపీవో సుశీలాదేవి

Updated Date - Aug 09 , 2026 | 01:21 AM