గ్యాస్ కొరత...హోటళ్ల మూత
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:55 AM
పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ రవాణా ఆగిపోయింది.ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్ వ్యాపారులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30వేలకు పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్సన్లున్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
- ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం
- తోపుడు బండ్ల వ్యాపారాలకూ దెబ్బ
- బ్లాక్‌లో దోచుకుంటున్న గ్యాస్ ఏజెన్సీలు
తిరుపతి సిటీ- ఆంధ్రజ్యోతి
పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ రవాణా ఆగిపోయింది.ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్ వ్యాపారులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30వేలకు పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్సన్లున్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. రోజువారీగా వంటలు చేయాల్సిన హోటళ్ల నిర్వాహకులు గ్యాస్ లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది యజమానులు తాత్కాలికంగా హోటళ్లను మూసివేశారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో, ఒక సిలిండర్ కోసం రోజుల కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన డిమాండ్, సరఫరా లోపం కారణంగా బ్లాక్ మార్కెట్‌లో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్‌కు రూ.3వేల నుంచి రూ3,500 వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కోసారి అంత మొత్తంలో ఇచ్చినా గ్యాస్ దొరకడంలేదని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. ఇక డొమెస్టిక్ సిలిండర్లను కొందరు బ్లాక్‌లో యదేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఒక్కో సిలిండర్ రూ.2వేల నుంచి రూ2,500 వరకు వసూలు చేస్తున్నట్టు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. మెనూ తగ్గించడం, ధరలు పెంచడం చేయాల్సి వస్తోందని మరో నెలరోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాపారాలు పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరువ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం
పెద్ద హోటళ్లు మాత్రమే కాకుండా టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింటు, తోపుడు బండ్లపై అల్పాహారాలు విక్రయించే వ్యాపారాలు గ్యాస్‌పై పూర్తిగా ఆధారపడుతుంటాయి. కానీ ప్రస్తుత కొరత వల్ల వంటలు ఆలస్యమవడం, గ్యాస్ దొరికిన రోజు హోటల్ తెరవడం, దొరకకపోతే మూసివేయడం వలన కస్టమర్లు తగ్గిపోతున్నారు. రోజువారీ ఆదాయం పడిపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని యజమానులు చెబుతున్నారు.
కట్టెల పొయ్యికి మళ్లీ హవా
గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు మళ్లీ కట్టెల పొయ్యి వినియోగానికి మారుతున్నారు. ఒకప్పుడు పాతబడిన విధానంగా భావించిన కట్టెల పొయ్యి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి కట్టెల డిమాండ్ పెరగడంతో వాటి ధరలు కూడా పెరిగినట్లు సమాచారం. అయితే కట్టెల పొయ్యి వినియోగం పెరగడం వల్ల పొగ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే వంట చేసే కార్మికుల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తక్షణ చర్యలు కోరుతున్న వ్యాపారులు గ్యాస్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, వాణిజ్య సిలిండర్ల అందుబాటును పెంచాలని హోటళ్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే చిన్న వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
- గ్యాస్ ఏజెన్సీల సంఖ్య - 63 (జిల్లాలో) 13 (తిరుపతిలో)
- డొమెస్టిక్ కనెక్షన్లు - 715360- 283000
- కమర్షియల్ కనెక్షన్లు - 25800- 5030
- నెలవారీ వినియోగం- 43వేల నుంచి 45వేలు 23 వేలు నుంచి 24వేలు