Share News

గంగమ్మ జలప్రవేశం

ABN , Publish Date - May 14 , 2026 | 01:18 AM

చిత్తూరు నడివీధి గంగమ్మ జలప్రవేశం (నిమజ్జనం)తో రెండు రోజుల జాతర సంబరాలు బుధవారం రాత్రితో ముగిశాయి. బజారువీధిలో కొలువైన గంగమ్మకు మంగళవారం వేకువజామున తొలిపూజ చేశాక.. భక్తులకు దర్శనం కల్పించారు.

గంగమ్మ జలప్రవేశం
రెండో రోజు భక్తులచే పూజలు అందుకుంటున్న నడివీధి గంగమ్మ

శోభాయాత్రలో ఒళ్లు గగుర్పొడిచేలా ఓం శక్తి భక్తుల విన్యాసాలు

చిత్తూరులో ముగిసిన రెండు రోజుల జాతర

చిత్తూరు నడివీధి గంగమ్మ జలప్రవేశం (నిమజ్జనం)తో రెండు రోజుల జాతర సంబరాలు బుధవారం రాత్రితో ముగిశాయి. బజారువీధిలో కొలువైన గంగమ్మకు మంగళవారం వేకువజామున తొలిపూజ చేశాక.. భక్తులకు దర్శనం కల్పించారు. రెండు రోజులపాటు చిత్తూరు నగరం, చట్టుపక్కల మండలాల ప్రజలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గంగమ్మను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. దీంతో చిత్తూరులో ఎటు చూసినా జాతర సంబరాలు, భక్తుల సందడే కనిపించాయి. బుధవారం సాయంత్రం వంశపారంపర్య ధర్మకర్త సీకేబాబు, సీకే లావణ్య దంపతులు, వారి కుమారుడు సీకే సాయి కృష్ణారెడ్డి పొన్నియమ్మన్‌ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి భక్తులతో కలిసి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి నడివీధి గంగమ్మకు సమర్పించారు. పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మంగళహరతినిచ్చి, నిమ్మ కాయలతో దిష్టి తీయడంతో గంగమ్మ జలప్రవేశ శోభాయాత్ర మొదలైంది. వందలాది మంది మహిళలు అమ్మవారి శోభాయాత్ర రథం వద్ద తడిబట్టలతో వరపడ్డారు. వారందరని అర్చకులు మంత్రించిన నీటితో చల్లి ఆశీర్వదించారు. శోభాయాత్రలో కేరళ చండామేళం, హరికృష్ణ వాయులీనం, సంగీత విభావరి భక్తులను అలరించాయి. కాగా, బజారు వీధి, శేషాఫిరాన్‌ వీధి మీదుగా శోభాయాత్ర హైరోడ్డుకు చేరుకోగానే అమ్మవారికి ఓంశక్తి బృందం కొక్కీలు తగిలించుకుని పూలమాలను సమర్పించారు. అక్కడ్నుంచి నిమజ్జన ప్రాంతానికి అమ్మవారిని తీసుకెళ్లారు. పూజలు చేసి, నిమజ్జన తంతు ముగించారు. ఆయా కార్యక్రమాల్లో ఉత్సవ నిర్వాహకులు సీకే బాబు దంపతులతో పాటు సంపత్‌ కుమార్‌, వెంకటేష్‌, గుణశేఖర్‌, పద్మనాభం, మల్లి ఆచ్చారి, సీఆర్‌సీ రవి తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఓంశక్తి భక్తుల విన్యాసాలు

గంగజాతరలో ఓం శక్తి భక్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అగస్త్యేశ్వరాలయం నుంచి వందలాది మంది ఓంశక్తి భక్తులు తమ శరీరాలకు శూలాలు గుచ్చుకుని ఆటోలు, లారీలు, టాక్సీలు, ఎక్స్‌కవేటర్లను లాగుతూ.. క్రేన్లపై వేలాడుతూ చర్చి వీధి, హై రోడ్‌ మీదుగా మాక్స్‌ సెంటర్‌కు చేరుకున్నారు. మరికొందరు మహిళలు, యువకులు, పిల్లలు నోటికి శూలాలు గుచ్చుకుని ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేశారు.

- చిత్తూరు కల్చరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - May 14 , 2026 | 01:18 AM