మైక్రో ఇరిగేషన్‌కు నిధులివ్వండి
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:28 AM
‘ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత డిజిటల్ రికార్డులను రూపొందించటంలో చిత్తూరు జిల్లా బాగా పని చేసింది. సంజీవని ప్రాజెక్టును అన్ని జిల్లాల్లోనూ సమర్థంగా అమలు చేస్తే ఫలితాలు వస్తాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చిత్తూరు జిల్లా వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది’ అంటూ సంజీవని ప్రాజెక్టుపై ప్రజంటేషన్ ఇచ్చాక కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.
హార్టికల్చర్ విస్తరణకు అపార అవకాశాలు
కలెక్టర్ల సదస్సులో సీఎంను కోరిన సుమిత్‌కుమార్
కుప్పంలో ‘సంజీవని ప్రాజెక్టు’పై ప్రజంటేషన్
చిత్తూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
‘ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత డిజిటల్ రికార్డులను రూపొందించటంలో చిత్తూరు జిల్లా బాగా పని చేసింది. సంజీవని ప్రాజెక్టును అన్ని జిల్లాల్లోనూ సమర్థంగా అమలు చేస్తే ఫలితాలు వస్తాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చిత్తూరు జిల్లా వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది’ అంటూ సంజీవని ప్రాజెక్టుపై ప్రజంటేషన్ ఇచ్చాక కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.
మైక్రో ఇరిగేషన్ విధానం ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు నిధులు ఇవ్వాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ కోరారు. అమరావతిలో బుధవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యాన 6వ కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను, ఎదుర్కొంటున్న సమస్యల్ని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో మైక్రో ఇరిగేషన్ విధానంలో ప్రస్తుతం 8 వేల హెక్టార్లలో హార్టికల్చర్ సాగు ఉందని, మరో 20 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు అవకాశాలున్నాయని వివరించారు. దీనికి అనుగుణంగా నిధులు రావడం లేదన్నారు. సకాలంలో నిధులు వస్తే హార్టికల్చర్ సాగును పెంచుతామని తెలిపారు. దీనికి అనుగుణంగా రైతులకు సబ్సిడీ అందించడంలో కొర్రీలున్నాయని కృష్ణా కలెక్టర్ బాలాజీ కూడా అడిగారు. దీంతో సీఎం చంద్రబాబు ఆ శాఖ ఉన్నతాధికారులతో లోతుగా చర్చించారు. సమస్యల్ని పరిష్కరించి, హార్టికల్చర్‌ను ప్రోత్సహించాలన్నారు. అలాగే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయా బ్యాంకుల బ్రాంచులు తక్కువగా ఉన్నాయని, వీటి సంఖ్య పెంచాలని ఏడాదిగా కోరుతున్నా వారిలో స్పందన లేదని కలెక్టర్ చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సంబంధిత అధికారికి అప్పగించారు.
సంజీవని విజయవంతం
కుప్పం, నారావారిపల్లెలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టుపై సదస్సులో కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆరోగ్యాంధ్ర కల సాకారంలో భాగంగా.. గ్రామీణ ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు సంజీవని ప్రాజెక్టును గతేడాది జూలై 3న సీఎం చంద్రబాబు కుప్పంలో ప్రారంభించారు. ప్రజలకు చేసిన వైద్య పరీక్షలు, వాడిన మందులు, ఆరోగ్య సమస్యలు, చికిత్స చేసిన వైద్యుడి పేరు.. వంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పేషంట్‌కు ఓ ఐడీ ఇస్తారు. ఇలా ఆరోగ్య సమాచారాన్ని క్రోడీకరించే కేంద్రాన్ని డిజిటల్ నెర్వ్ సెంటర్ అంటారు.
‘తొలి విడతగా కుప్పం నియోజకవర్గం, నారావారిపల్లెలోని 3.1 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డుల్ని సిద్ధం చేశాం. రెండో విడతలో జిల్లాలోని 20 లక్షల మంది ఆరోగ్య వివరాల్ని క్రోడీకరిస్తున్నాం. 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. గర్భిణులు- శిశువుల సంరక్షణ, అంటువ్యాధులు, బీపీ, షుగర్, కంటి, ముక్కు, చెవి, గొంతు, మానసిక ఆరోగ్య సేవలతో వృద్ధుల సంరక్షణ ఇందులో భాగం. వర్చువల్ విధానంలో రోగులు వైద్యులతో సంప్రదించవచ్చు. జిల్లాలోని అన్నిరకాల 119 ఆరోగ్య కేంద్రాలను ఈ నెట్‌వర్కులోకి చేర్చాం’అని కలెక్టర్ వివరించారు. ‘ఈ ఏడాది జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2086 ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని అమలు చేయడం, సుమారు 5.2 కోట్ల ప్రజలకు సేవలు అందించడం భవిష్యత్తు ప్రణాళిక’అని సంబంధిత రాష్ట్ర అధికారి సీఎంకు వివరించారు.