గండికోట నుంచి కుప్పం వరకు
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:12 AM
తొలి దశ (ఫేజ్-1): ఇప్పటికే రూ.2370 కోట్లతో ఈ పనులు ప్రారంభమయ్యాయి
తొలి దశ (ఫేజ్-1): ఇప్పటికే రూ.2370 కోట్లతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు పుష్కలంగా తాగునీరు అందనుంది.
రెండో దశ (ఫేజ్-2): రూ.2886 కోట్లతో పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. ఈ పనులు పూర్తయితే మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పానికి ప్రయోజనం కలగనుంది.
చిత్తూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు ఫేజుల్లో కడప జిల్లాలోని గండికోట నుంచి ఉమ్మడి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో గతేడాది ఫేజ్-1 పనులు ప్రారంభమవ్వగా, తాజాగా ఫేజ్-2 పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ రెండు ఫేజుల్లో పనులు పూర్తయితే అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఎక్కడి నుంచి ఎక్కడికి..
‘చిత్తూరు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలకు తాగునీటి సరఫరా పథకం’ పేరుతో దీన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కడప జిల్లాలోని గండికోట వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడి నుంచి జిల్లాకు నీళ్లను తెస్తుంది. పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తారు. అక్కడ నీటి శుద్ధి చేసి ఆయా ప్రాంతాలకు పంపిస్తారు.
ఫేజ్-1 కింద మూడు నియోజకవర్గాలకు..
ఫేజ్-1 కింద పనుల కోసం ప్రభుత్వం రూ.2370 కోట్ల నిధుల్ని కేటాయిచింది. గతేడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభమవ్వగా.. 2027 అక్టోబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.90 కోట్ల మేర పనులు పూర్తవ్వగా, ఇక నుంచి పనులు ఊపందుకోనున్నాయి. ఈ పనులు పూర్తయితే రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఫేజ్-2 కింద నాలుగు నియోజకవర్గాలకు..
ఫేజ్-2 పనుల కోసం ప్రభుత్వం రూ.2886 కోట్లతో టెండర్ పిలిచింది. జూన్ 12 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ హరేరామ్ నాయక్ ఈ నెల 5వ తేదీన ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పనులు పూర్తయితే మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది.
రోజుకు 75 మిలియన్ లీటర్ల శుద్ధి
ఈ పనులు రెండు ఫేజుల్లో జరుగుతుండగా, రెండింటికీ కలిపి వేర్వేరు ట్రీట్‌మెంట్ ప్లాంట్లను గుర్రంకొండలో నిర్మిస్తున్నారు. ఫేజ్-1కు సంబంధించిన ప్లాంట్ పనులు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ దశలో ఉన్నాయి. ఫేజ్-2 టెండర్ అయ్యాక అక్కడే మరో ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఒక్కో ప్లాంట్‌లో రోజుకు 75 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేయనున్నారు. అంటే రెండు ప్లాంట్లలో కలిపి రోజుకు 150 మిలియన్ (15 కోట్ల) లీటర్ల శుద్ధి జరుగుతుంది.