మంగాపురం ఘటనలో ‘క్లూ’ కోసం మళ్లీ తనిఖీలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:17 AM
చిత్తూరు రూరల్ మండలం మంగాపురంలోని ఓ ఇంటి వద్ద హత్య, గ్లాస్ డోర్ పగలగొట్టేందుకు బాంబు వేసిన ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఎలాంటి క్లూ లభించలేదు. దీనికోసం పోలీసులు మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తున్నారు. మంగాపురం, గుడిపాల పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం కూడా అదనపు ఎస్పీ మహబూబ్ బాషా ఘటన జరిగిన ఇంటిని, గ్రామ పరిసరాలను పరిశీలించారు. మరో ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీ చూశారు.
చిత్తూరు రూరల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): చిత్తూరు రూరల్ మండలం మంగాపురంలోని ఓ ఇంటి వద్ద హత్య, గ్లాస్ డోర్ పగలగొట్టేందుకు బాంబు వేసిన ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఎలాంటి క్లూ లభించలేదు. దీనికోసం పోలీసులు మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తున్నారు. మంగాపురం, గుడిపాల పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం కూడా అదనపు ఎస్పీ మహబూబ్ బాషా ఘటన జరిగిన ఇంటిని, గ్రామ పరిసరాలను పరిశీలించారు. మరో ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీ చూశారు. ఇంటి యజమానిని విచారించారు. గ్రామంలోనే పోలీసుల బృందం ఉంది. గ్రామ పరిసరాల్లోని మామిడితోటలు, గుట్లల్లో తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను తీసుకెళ్లి విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెక్కీ నిర్వహించి ఉంటే.. ఇంట్లో వృద్ధ దంపతులు ఉన్నారని తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు కాపలాదారు ఆనందరావును హతమార్చిన దుండగులు, బాంబు శబ్దానికి ఆ వృద్ధ దంపతులు వేసిన కేకలకే పరారుకావడం మరింత అనుమాన్ని రేకెత్తిస్తోంది. దోపిడీకి వస్తే ఇంటి చుట్టుపక్కల ఏ గ్లాస్ డోర్‌నైనా సైలెంట్‌గా పగలగొట్టి వెళ్లొచ్చు. అంతేకానీ పెద్ద శబ్దం వచ్చేలా నాటుబాంబు వేయడంపై పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఒకవేళ ఆనందరావును చంపడానికే వచ్చి.. పోలీసులను డైవర్ట్ చేసేందుకు నాటుబాంబు వేసి దోపిడీకి వచ్చిన దొంగలని అనుకునేలా చేశారా అనే అనుమానాలూ ఉన్నాయి. అయితే, ఇంటికి వాడిన అద్దాలు బులెట్‌ప్రూఫ్ మాదిరి స్ట్రాంగ్ కావడంతో గ్రిల్స్ ఏర్పాటు చేయలేదని ఇంటి యజమానులు చెబుతున్నారు. సుత్తి, రాడ్లతో ఇవి పగలవనే అనుమానంతోనే నాటుబాంబు వేసుంటారనీ పోలీసులు భావిస్తున్నారు. అంటే.. అద్దాల గురించి బయట వ్యక్తులకు తెలిసే అవకాశం లేదు. ఈ ఇంటి గురించి బాగా తెలిసిన వారే ఈ పని చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.